Jul 28,2021 07:03

న్యూఢిల్లీ : పెగాసస్‌ స్పైవేర్‌ నిఘాపై దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. నిఘా వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ లేదా మాజీ న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విధమైన మిలటరీ గ్రేడ్‌ స్పైవేర్‌ను వినియోగించి నిఘా పెట్టడం అనేది ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, అదేవిధంగా మన ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాలుగా ఉన్న స్వతంత్ర సంస్థలపై దాడి చేసేందుకు, వాటి కార్యకలాపాల్లో చొరబడడంతో పాటు అస్థిరపరిచే ప్రయత్నాలను సూచిస్తోం దని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఈ స్పైవేర్‌ నిఘా అనేది అక్రమంగా జరిగిందా లేక తమ 'అశీస్సుల 'తోనే జరిగిందా అనేదానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు సరైన స్పష్టత ఇవ్వలేదని, నిఘాకు సంబంధించి వస్తున్న తీవ్రమైన ఆరోపణలపై విశ్వసనీయమైన, స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ముందుకు రాలేదని అన్నారు. టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 5(2)ను ఈ అక్రమ నిఘా ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులు లేదా ప్రజా భద్రతా దృష్ట్యా మాత్రమే నిఘా సమర్థించబుడుతోందని, అయితే అటువంటి పరిస్థితులను ప్రభుత్వ అంచనాపై నిర్ణయించలేమని, సహేతుకమైన కారణాలు ఉండాలని అన్నారు. పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా చేపట్టిన నిఘా క్రిమినల్‌ నేరం అవుతుందని అభిప్రాయపడ్డారు.