Jul 29,2021 07:45

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పౌర సమాచార భద్రత, గోప్యతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై చర్చ జరపనీయకుండా ఏకంగా ఒక పార్లమెంటరీ స్టాంటింగ్‌ కమిటీని బిజెపి నిర్వీర్యం చేస్తోంది. కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ఛైర్మన్‌గా ఉన్న సమాచార, సాంకేతిక (ఐటి) పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 'పెగాసస్‌'పై చర్చించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర హోంశాఖ, ఎలక్ట్రానిక్స్‌, ఐటి శాఖ (ఎంఇఐటివై), టెలికాం శాఖకు చెందిన ఉన్నతాధికారులు రావాల్సివుండేది. భేటీకి హాజరు కావాలని అధికారులకు కమిటీ సమన్లు కూడా పంపింది. అయితే ఈ శాఖల నుంచి ఒక్కరంటే ఒక్క అధికారి కూడా సమావేశానికి హాజరుకాలేదు. గైర్హాజరుకు వేర్వేరు కారణాలు తెలిపారు. మరోవైపు బిజెపి సభ్యులు రెండో రోజు కూడా ఈ కమిటీ సమావేశాన్ని బహిష్కరించారు. కేవలం తొమ్మిది మంది బిజెపి ఎంపిలు సమావేశ మందిరానికి వచ్చారు. కానీ రిజిస్టరులో సంతకం చేయలేదు. సమావేశం ప్రొసీడింగ్స్‌ జరగాలంటే కనీసం 10 మంది ఎంపిలు హాజరుకావాల్సి ఉంది. కోరం లేకుండా చేసి సమావేశాన్ని వాయిదా పడేలా చేయడమే బిజెపి ఎంపిల ఉద్దేశ్యమని కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరం ట్వీట్‌ చేశారు. చర్చకు, విచారణకు అస్కారం లేకుండా బిజెపి నేతలు అడ్డుపడుతున్నారని, వారు దేనికి భయపడుతున్నారో అర్థంకావడం లేదన్నారు. బిజెపి ఒత్తిళ్లతోనే అధికారుల గైర్హాజరుకు కారణమని పలువురు విమర్శించారు. దేశంలో 300 మంది పైగా ప్రముఖులపై 'పెగాసస్‌'తో నిఘా పెట్టినట్లు కథనాలు వెలువడిన నేపథ్యంలో అటు పార్లమెంటులో చర్చకు సాహసించని మోడీ సర్కార్‌ ఇటు స్థాయీ కమిటీల్లోనూ చర్చకు అవకాశం లేకుండా చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి.
శశిథరూర్‌పై ప్రివిలైజ్‌ మోషన్‌
కాగా శశిథరూర్‌ కాంగ్రెస్‌ అజండాను ముందుకు తెస్తున్నారని, తమకు ఆయనపై విశ్వాసం లేదంటూ బిజెపి ఎంపి నిషికాంత్‌ దుబే సభలో ప్రవిలేజ్‌మోషన్‌ ప్రవేశపెట్టారు. ఐటి స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి శశి థరూర్‌ను తొలగించాలని కోరారు. మంగళ, బుధవారాల్లో రెండు రోజులూ స్టాండింగ్‌ కమిటీ సమావేశాన్ని బిజెపి ఎంపీలు బుధవారం ఏకంగా కమిటీ ఛైర్మన్‌పై విశ్వాసం లేదంటూ నోటీసులివ్వడం విశేషం. ఈ సందర్భంగా నిషికాంత్‌ దుబే మీడియాతో మాట్లాడుతూ శశి థరూర్‌ను విశ్వసించబోమని పేర్కొన్నారు. స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ను తొలగించడానికి ఎలాంటి నిబంధనలు లేవని తెలిపారు.