పెగాసస్ స్పైవేర్‌ను ప్రయోగించి ప్రముఖుల కదలికలపై నిఘా వేసిన వ్యవహారం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పలువురు కేంద్ర మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, ఎన్నికల కమిషనర్లు, పాత్రికేయులు, చివరికి సుప్రీంకోర్టు జస్టిస్‌లు సహా దేశంలోని 300 మందికిపైగా పెగాసస్ నిఘా బారిన పడడం తప్పక ఆందోళన కలిగిస్తుంది. అందరి స్మార్ట్ ఫోన్లకు ఫోరెన్సిక్ పరీక్షలు చేయిస్తేగాని ఇంకెంత మంది నిఘా నీడలో ఉన్నారో తెలీదు. ఫ్రాన్స్‌కు చెందిన ఆమ్నేస్టి ఇంటర్నేషనల్, ఫర్‌బిడెన్ స్టోరీస్ అనే వార్తా సంస్థలు రెండ్రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా పెగాసస్ నిఘాలో ఉన్న వారి జాబితాను వెల్లడించగా అమెరికాకు చెందిన 'వాషింగ్టన్ పోస్టు', మన దేశంలోని 'ద వైర్' మీడియా సంస్థలు ఆ వివరాలను ప్రచురించాయి. 45 దేశాలకు చెందిన 50 వేల మంది పేర్లు పెగాసస్ నిఘాలో ఉన్నట్లు వెల్లడి కాగా వెయ్యి మందిని గుర్తించారు. గుర్తించిన వారిలో 300కు పైగా భారత్‌కు చెందినవారే. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి సహా పలువురు ఉపయోగించిన పోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు పెగాసస్ వ్యవహారం బట్టబయలు కావడంతో మోడీ సర్కారు గుక్కతిప్పుకోలేని స్థితిలో పడింది. అయినాసరే, వాస్తవాలు అంగీకరించే బదులు, ఖండనలు, ఉద్దేశాలు ఆపాదించడానికే కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశ్వనీ వైష్ణవ్ యత్నించారు. తీరా ఆయన ఫోన్ కూడా హ్యాకింగ్‌కు గురైందనే సరికి ఏమీ పాలుపోని స్థితిలో పడ్డారు.
పెగాసస్ అలజడి 2019లోనే లేచింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ సంస్థ పెగాసస్ స్పైవేర్‌ను రూపొందించి వివిధ దేశాల ప్రభుత్వాలకు విక్రయించింది. ఆ సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లో పలువురిపై నిఘా పెట్టిన ఉదంతం గుప్పుమంది. అప్పుడు మోడీ ప్రభుత్వం సరైన జవాబు చెప్పలేదు. అనధికారికంగా ఎవ్వరిపైనా నిఘా లేదని మాత్రమే పేర్కొంది. వాట్సాప్, యాపిల్, ఫేస్‌బుక్...పెగాసస్ నిఘా నుండి తప్పించుకోడానికి సెక్యూర్టీ ఫీచర్లను అప్‌డేట్ చేశాయి. ఇప్పుడు మరోసారి పెగాసస్ నిఘా వ్యవహారం బయటికి పొక్కడంతో ప్రభుత్వం బోనులో నిలబడాల్సి వచ్చింది. పెగాసస్ స్పైవేర్ ఒక్కసారి వ్యక్తుల ఫోన్లలోకి జొరబడితే వారి కదలికలన్నీ హ్యాకర్లకు తెలిసిపోతాయి. తాజాగా బయట పడుతున్న విషయాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. రాఫెల్ డీల్‌పైనా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు, ప్రధాని మోడీ సన్నిహితుడు నిఖిల్ మర్చంట్ మధ్య లావాదేవీలపైనా, మంత్రి పీయూష్ గోయల్, బిజినెస్ మ్యాన్ అజరు పిరమిల్ మధ్య సంబంధాలపైనా పరిశోధనలు జరిపిన జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. మచ్చుకు వెల్లడైన ఈ ఉదంతాలనుబట్టి హ్యాకింగ్ ఎవరిపనో, ఎవరికి ఆ అవసరం ఉందో అర్థమవుతుంది.
పెగాసస్ వంటివి కరడుగట్టిన ఉగ్రవాదులను, తీవ్రాతితీవ్ర నేరాలు చేసిన క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి తప్ప ప్రజలపై నిఘా పెట్టడానికి కాదని స్పైవేర్‌ను తయారు చేసిన ఎన్‌ఎస్‌ఒ నే పేర్కొంది. పైగా తమ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వాలకే అమ్ముతామంటోంది. అలాంటప్పుడు కచ్చితంగా భారత ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నది స్పష్టం. మోడీ ప్రభుత్వం ఎన్ని కుప్పిగంతులేసినా తప్పించుకోవడం అసాధ్యం. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎన్‌ఎస్‌ఒ తో సర్కారు నెరపిన వ్యవహారాలను, నిధులెన్ని చెల్లించినదీ, ఎక్కడెక్కడ సాఫ్ట్‌వేర్‌ను వాడినదీ గుట్టు విప్పాలి. గతంలో ఐ.టి రూల్స్ మార్పు ద్వారా హక్కుల కార్యకర్తల ఫోన్లు, కంప్యూటర్లలోకి చొచ్చుకెళ్లి అక్రమ అరెస్టులకు ప్రభుత్వం పాల్పడింది. రాజద్రోహం కేసులు బనాయించి జైళ్లలో మగ్గేలా నిరంకుశ చర్యలకు ఒడిగట్టింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పౌరుల వ్యక్తిత స్వేచ్ఛకు విఘాతం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం. ప్రాథమిక హక్కుల హననం. ప్రభుత్వ తప్పిదాలపై ఎదుర్కొనే ధైర్యం లేకనే మోడీ సర్కారు ఇలాంటి తప్పుడు మార్గాలను ఎంచుకుంది. నిరంకుశ చర్యలను ప్రజలు సహించరు.










