ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. నేరాల తగ్గుదలకు, నేరాల పరిశోధనకు సిసి కెమెరాల పాత్ర కీలకమైనదన్నారు. పర్చూరు స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 32 సిసి కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక పరిస్ధితుల్లో నేరాలు జరుగుతుంటే వాటిని నియంత్రించేందుకు పోలీసు శాఖ కూడా ఓ అడుగు ముందుకేసి పరిశీలన చేపడుతుందన్నారు. ఒక్కో కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ప్రస్తుతం పర్చూరు ప్రాంతం సిసి కెమేరాల నిఘా నీడలో ఉందని అన్నారు. 30 రోజుల పాటు వీడియో నివిడి కలిగేలా అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందుకు దాతల సహకారం మరువలేనిదన్నారు. పర్చూరు ఎస్‌ఐ చెంచు ప్రసాద్ ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. అనంతరం సిసి కెమెరాల దాతను సత్కరించి ప్రశంశాపత్రాలు అందించారు. అనంతరం బొమ్మల సెంటర్‌లో పర్చూరు గంగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో బాపట్ల డిఎస్పీ ఎ శ్రీనివాసరావు, మార్టూరు సిఐ షేక్ టి ఫిరోజ్, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ ఎ శ్రీనివాసరావు, మార్టూరు ఎస్‌ఐ కమలాకర్, రోటరీ క్లబ్ ప్రతినిధులు నాగభైరు శ్రీనివాసరావు, పంబి సదానందరెడ్డి, కోట శ్రీనివాసరావు, ఏవి కృష్ణారావు, కాసా అశోక్ తదితరులు పాల్గొన్నారు.










