
ప్రజాశక్తి - భట్టిప్రోలు
రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడికక్కడ అద్వానంగా రోడ్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు కేటాయించినప్పటికీ పనిచేసేవాళ్లు లేరు. రహదారిని వేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తాతావారిపాలెం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని సురేపల్లి పంచాయతీలోని తాతావారిపాలెం వరకు ఉన్న రహదారికి గత టిడిపి పాలనలో రూ.98.5లక్షల నిధులు మంజూరై బ్యాంకులో ఉన్నాయి. ఈ నిధులతో ఆనాడు సిసి రహదారి నిర్మించేందుకు కీ వాల్ కూడా ఏర్పాటు చేశారు. పనులు పూర్తికాకముందే ఎన్నికల సమీపించడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో ఈ రహదారి పూర్తిగా అద్వాన స్థితికి చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. సురేపల్లి, తాతావారిపాలెం గ్రామాల మధ్య ఉన్న రహదారి ప్రస్తుతం కంకర రాళ్లుపైకి లేచి వాహనాలు తిరగడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. రహదారి నిర్మించే గుత్తేదారు మాత్రం గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా మధ్యలో అవసరమైన కల్వర్టులను ఏడాదికి ఒకటి చొప్పున మాత్రమే నిర్మించి రోడ్డు పనులు మాత్రం వదిలేశారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సర్పంచి మోర్ల సత్యనారాయణ చొరవ చూపి కొందరి దాతల సహకారాన్ని కలుపుకొని రెండు గ్రామాల మధ్య గుంటలు పడిన ప్రాంతంలో డస్టును నింపి రహదారిని శుభ్రపరుస్తామని ప్రయత్నింగా అధికారులు అందుకు నిరాకరించారు. దీంతో అది కూడా నిలిచిపోయిందని వాపోయారు. ప్రభుత్వ నిధులతోనే రహదారిని పూర్తి చేస్తామని, దాతల సహకారం అవసరం లేదని చెబుతున్న అధికారులు పనులు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిధులకు ముగియనున్న గడువు
సూరేపల్లి, తాతావారిపాలెం గ్రామాల మధ్య రహదారి అభివృద్ధికి మంజూరైన నిధులకు నెలాఖరుతో గడువు ముగుస్తుంది. ఆ నిధులను నెలాఖరులోపు ఖర్చు చేయకుంటే వెనక్కు వెళతాయని చెబుతున్నారు. గత టిడిపి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఇప్పుడెందుకు పనులు చేయాలని వైసిపి నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వైసిపి పాలనలో చేసిన పనులకే బిల్లులు రాక పనులు చేసినవాళ్లు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఉన్న నిదులు వెనక్కి వెళితే తమ గ్రామాల మద్య రోడ్డు ఏమేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా పరిషత్తు స్పెషల్ డిఈ సాయి కిషోర్ మాట్లాడుతూ ఈ రహదారికి మంజూరైన నిధుల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్న మాట వాస్తవమేనని తెలిపారు. దీనిని ఏప్రిల్ ఆఖరి వరకు పొడిగించేందుకు ప్రభుత్వానికి, బ్యాంకుకు సిఫారసు చేసినట్లు తెలిపారు.