ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి జోన్ పరిధిలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఒక్కో సచివాలయానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షలు చొప్పున నిధులు రాబట్టడంతో స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పూర్తిగా విఫలమయ్యారని టిడిపి నేతలు ఆరోపించారు. బుధవారం విలేకర్ల సమావేశంలో టిడిపి నగర కార్యదర్శి పిట్టా సురేష్, ఒకటో వార్డు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.సూరిబాబు, వానపల్లి సత్య, సీనియర్ నాయకులు ఎస్ నరసింగరావు మాట్లాడుతూ, జోన్ పరిధిలో 21 వార్డు సచివాలయాలుండగా, ఒక్కో సచివాలయానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.20లక్షలు కేటాయిస్తే రూ.4.20 కోట్లు మంజూరు కావాల్సి ఉందన్నారు. అయితే 2.52కోట్లు నిధులు విడుదలైనట్లు స్వయంగా ఎమ్మెల్యే ముత్తంశెట్టి ప్రకటించారంటే మిగిలిన నిధులు ఏమైపోయాయని ప్రశ్నించారు. దీన్ని బట్టి అదనపు నిధులు మాట అటుంచితే, ప్రకటించిన నిధులైనా తెచ్చుకోవడంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందినట్టేనని స్పష్టమౌతోందన్నారు.










