Oct 31,2022 23:04

  • టిడిపి సభ్యుల మద్దతు

ప్రజాశక్తి - విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విఎంసికి రావాల్సిన వందల కోట్ల నిధులను రాబట్టడంలో అధికార వైసిపి ఘోరంగా విఫలమైందని సిపిఎం, టిడిపి సభ్యులు తీవ్రంగా విమర్శించారు. ఈ నిధులను వెంటనే రాబట్టాలని కోరుతూ కౌన్సిల్‌ సమావేశానికి ముందు సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు నేతృత్వంలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో టిడిపి సభ్యులు మద్దతుగా పాల్గొన్నారు. విఎంసి కార్యాలయ ఆవరణలోని బ్యాంక్‌ వద్ద నుంచి కౌన్సిల్‌ హాలు వరకు బ్యానర్‌ చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. నిధులు రాబట్టడంలో ఘోరంగా విఫలమైన వైసిపి డౌన్‌..డౌన్‌ అంటూ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం, టిడిపి సభ్యులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.650 కోట్ల వరకు విఎంసికి విడుదల కావాల్సి ఉందన్నారు. ఇవి రాకపోవడంతో నిధుల సమస్యతో నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), సీనియర్‌ సభ్యులు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని వెంకట ప్రసాద్‌, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
లంకా గోవిందరాజులు మృతికి సంతాపం
ఇటీవల మృతి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులకు కౌన్సిల్‌ తీవ్ర సంతాపం తెలిపింది. 1984-85లో విఎంసి మేయర్‌గా ఉండి ఆగస్టు 18న తుదిశ్వాత విడిచిన లంకా గోవిందరాజులుతోపాటు యుపి మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌ మృతికి కౌన్సిల్‌ తీవ్ర సంతాపం తెలిపింది.
కౌన్సిల్‌కు పరిచయం చేసుకున్న విఎంసి సెక్రటరీ
సమావేశం ప్రారంభమైన వెంటనే ఇటీవల కౌన్సిల్‌ సెక్రటరీగా బదిలీపై విఎంసికి వచ్చిన కల్లూరి వసంతలక్ష్మి కౌన్సిల్‌కు పరిచయం చేసుకున్నారు. గుంటూరు కార్పొరేషన్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఆమె ఇక్కడికి వచ్చారు.