
ఆకివీడు మండల సమావేశంలో ఎంపిటిసి సభ్యులు హనుమ ఆవేదన
ప్రజాశక్తి - ఆకివీడు
గ్రామాభివృద్ధికి నిధులు మంజూరైన విషయం కూడా తమకు తెలియజేయరా అంటూ గుమ్మలూరు ఎంపిటిసి సభ్యులు కోపెల హనుమ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు మంజూరైనట్లు తమకు సమాచారం అందిందని, ఆ మేరకు వెంటనే సొంత సొమ్ములు చెల్లించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పటివరకు ఆ నిధులు తమ చేతికి అందలేదని గ్రామ సర్పంచి కోట అనంతలక్ష్మి చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి, ప్రజా సమస్యలు తీర్చడానికి ఉన్నామని, తమ బాధ్యతగా తాము ఆ పనులు చేశామని చెప్పారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి కటారి జయలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని ప్రభుత్వ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు అజెండాగా చర్చ సాగింది. ఈ క్రమంలో గుమ్మలూరు గ్రామాభివృద్ధికి నిధుల మంజూరు అంశంపై సభలో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఒక దశలో జెడ్‌పిటిసి సభ్యులు వెంకటరాజు కలుగజేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిడిఒ శ్రీవాణి మాట్లాడుతూ మండలంలో ప్రత్యేకించి ఆకివీడులో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఇష్టంలేనివారి వద్ద నుంచి, ఆ రకంగా పత్రం రాయించి తీసుకోవాలని ఇంజినీరింగ్ శాఖాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.