ప్రజాశక్తి - పెదనందిపాడు : గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని, భూసేకరణకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న రైతు ఉద్యమాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి చెప్పారు. మండలంలోని నాగులపాడులో రైతు సంఘం నాయకులు కన్నెగంటి చంద్రారావు తల్లి కన్నెగంటి చాయమ్మ చిత్రపటానికి రమాదేవి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గుంటూరు ఛానల్ విస్తరణ కోసం సుదీర్ఘకాలంగా ఉద్యమం నడుస్తోందని. ఐదు మండలాల్లో 50 గ్రామాలకు తాగునీరు, 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని అన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో గుంటూరు ఛానల్ సాధన సమితి నాయకులు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్, గుంటూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లను కలిశారని, సమస్యను వివరించి వినతి పత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఛానల్ విస్తరణపై ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడుదల రజిని చొరవ చూపి నిధులు విడుదల చేయించాలని కోరారు. నిధులు విడుదలై పనులు చేసేదాక ఈ ప్రాంత రైతులు ఉద్యమించాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి ఢిల్లీలో రైతులు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే అసెబ్లీ ముట్టడికీ ఈ ప్రాంత రైతులు, మహిళలు వెనకాడబోరని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టు కూడా కేటాయింపుల్లేక ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి నిధుల కేటాయింపు తగ్గించిందని, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఉద్యమించాలని అన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష రాజకీయ వేదిక నాయకులు మాజీ ఎంపిపి ఎన్.బాలకృష్ణ, సిపిఎం నాయకులు కె.నాగేశ్వరరావు, బి.శంకరయ్య, కె.వెంకటశివరావు, కె.శివనాగేశ్వరరావు, సిహెచ్.యానాదులు, నాగులపాడు మాజీ ఎంపిటిసి జి.శైలజ, ఎం.రాఘవయ్య, పి.రాంబాబు, జి.శ్రీనివాసరావు, కె.శ్రీను, పి.శేషగిరిరావు, ఎం.సింగయ్య, పి.హరిబాబు, ఎన్.రాజేంద్ర పాల్గొన్నారు.










