Apr 19,2023 22:51

సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి జోగి రమేష్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణంపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ సమీక్షించారు. పురోగతిపై మంత్రితోపాటు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరు జైన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యం కావాలని కోరారు. గుంటూరు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రతిరోజూ 128 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ప్రస్తుతం 28 మాత్రమే నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక అధికారులు, మండలస్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్‌ నిత్యం పర్యవేక్షించాలన్నారు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఇళ్ల నిర్మాణాలను పరుగులు పెట్టించాలని చెప్పారు. అజరు జైన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న కాలనీలకు భూసేకరణ, మెరకలు, మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టగా ఇందులో గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లోనే రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. కానీ ఈ జిల్లాల్లోనే పురోగతి తక్కువగా ఉందని, గుంటూరు జిల్లాలో 67,678 ఇళ్ల నిర్మాణాలను మంజూరు చేయగా 8025 మాత్రమే పూర్తయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ నగరానికి దూరంగా ఉన్న లే అవుట్లకు రానున్న రోజుల్లో మంచి రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావటంతో పాటు పట్టణాల్లో కలిసి పోతాయన్నారు.
సున్నావడ్డీతో రూ.4 లక్షలు రుణాలివ్వాలి : ఎమ్మెల్సీ కెఎస్‌
ఎమ్మెల్యే కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రూ.1.80 లక్షలు, డ్వాక్రా సంఘం ద్వారా అందించే బ్యాంకు రుణం రూ.35,000 సరిపోవని, నిర్మాణాలు వేగవంతం కావాలంటే జాతీయ బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు కనీసం రూ.2-3 లక్షలను సున్నావడ్డీకి ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. పేరేచర్ల లేఅవుట్‌ గుంటూరుకు 16 కిలో మీటర్ల దూరంలో ఉందని, గుంటూరులో నివసిస్తూ రోజువారి పనులు చేసుకునే వారు అంతదూరం వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని చెప్పారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ స్థానికి ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యాంతోనే ఇళ్ల నిర్మాణం వేగవంతం అవుతుందన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ఇళ్లు నిర్మించుకునే వారికి స్వచ్ఛంద సేవాసంస్థలు, వ్యాపార సంస్థల సిఎస్‌ఆర్‌ ద్వారా ఆర్థిక సాయం అందించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్‌ మాట్లాడుతూ పేరేచర్ల లే అవుట్‌కు పక్కాగా అప్రోచ్‌ రోడ్డు నిర్మించాలని, కొర్నెపాడు లే అవుట్‌లో లెవలింగ్‌ పూర్తి చేసి లబ్ధిదారులకు స్థలాలు చూపించాలని కోరారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ పొన్నూరు పట్టణంలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, పెదకాకాని మండలంలో వారికి సిఆర్‌డిఎ పరిధిలో కేటాయించే స్థలాల్లో ఇళ్లు అప్షన్‌ 3 క్రింద ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని కోరారు. నారాకోడూరులో ఇళ్ల స్థలాలకు సేకరించిన భూమిపై కోర్టులో ఉన్న కేసును పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ డిఆర్‌డిఎ, మెప్మా ద్వారా డ్వాక్రా సంఘాల్లోని లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా అందించే రుణాలను అప్షన్‌ 3లో ఇళ్లు నిర్మిస్తున్న ఏజెన్సీలకు ప్రారంభ దశలోనే అందించాలని సూచించారు. గుంటూరు మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు మాట్లాడుతూ నగరంలోని లబ్ధిదారులకు సమీపంలోని గ్రామాల్లో ఐదు లేఅవుట్లలో ఇంటి స్థలాలు ఇచ్చారని, లే అవుట్లలో పూర్తి స్థాయిలో మౌలిక సౌకర్యాలు, ఇతర వసతులు కల్పించటానికి ప్రత్యేకంగా నగరపాలక సంస్థకు నిధులు కేటాయించాలని కోరారు.
అనంతరం మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలను మండలస్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు లే అవుట్‌లలో క్షేత్ర స్థాయిలో పరిశీలించి, చిన్న సమస్యలుంటే వాటిని స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణానికి నిధుల సమస్య లేదని, ఇప్పటి వరకు ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు పెండింగ్‌ లేకుండా నగదు ఎప్పటికప్పుడు జమ చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 67,678 ఇళ్ల నిర్మాణాలను మంజూరు చేయగా ఇప్పటి వరకు 8025 పూర్తయ్యాయని, 34256 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. సమావేశంలో శాసనమండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జెసి జి.రాజకుమారి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివనారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకట శివరామిరెడ్డి, గృహనిర్మాణ శాఖ పీడీ సాయినాథ కుమార్‌, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.