ప్రజాశక్తి-ముంచంగిపుట్టు: 14, 15వ ఆర్ధిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాలో జమ చేయాలని మండలంలోని ధారెల పంచాయతీ సర్పంచ్ పాండురంగ స్వామి ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయ అడ్డాకుల డొప్పలతో ప్రజా చైతన్య దీక్షను శుక్రవారం రంగిలసింగి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీ అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆర్ధిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాలో జమ చేయాలన్నారు. ప్రజా చైతన్య దీక్షను ప్రతి గ్రామంలో దశల వారీగా గిరిజన సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14,15వ ఆర్ధిక సంఘం నిధులు దారి మళ్ళించడం దుర్మార్గమన్నారు. దేశ అబివృద్దికి గ్రామాలే పట్టుకొమ్మలని, పంచాయితీలో నిధులు లేక కనీసం పారిశుధ్యం, వీధిదీపాలు, వేయించలేని దుస్థితి నెలకొందని తెలిపారు. ఇది వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. తక్షణమే పంచాయతీల ఖాతాలో నిధులు జమ చేయాలని పాండురంగ స్వామి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వైసిపి ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ దీక్షలో వార్డు మెంబర్ చిట్టపులి గణపతి పడాల్, గ్రామ పెద్దలు తాంగుల మాణిక్యం, సహదేవ్, ఆనంద్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.










