ప్రజాశక్తి - మంత్రాలయం
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధుల తర్వాత దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దేవదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆది శేషనాయుడవును ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అడిగి తెలుసుకున్నారు. గురువారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఎమ్మెల్యేకు శాలువా, పుష్ప గుచ్ఛం అందజేసి సన్మానించారు. టిటిడి తరపున నియోజకవర్గంలోని 31 దేవాలయాలకు నిధులు మంజూరు కాగా, ఆ తర్వాత చేపట్టాల్సిన పనులను అసిస్టెంట్ కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మంత్రాలయం నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరారు. వైసిపి కోసిగి మండల ఇన్‌ఛార్జీ మురళీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
మసీదు నిర్మాణానికి భూమి పూజ
మండలంలోని తుంగభద్ర గ్రామంలో మసీదు నిర్మాణానికి ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి భూమిపూజ చేశారు. గతంలో ఉన్న మసీదు పాత పడడం వల్ల నూతన మసీదు నిర్మాణానికి మతపెద్దల సమక్షంలో నిర్మాణం కోసం ప్రణాళిక చేశారు. మత పెద్దలు ముస్లింల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథి ఎమ్మెల్యేకు, వైసిపి కోసిగి మండల ఇన్‌ఛార్జీ మురళీ మోహన్ రెడ్డికి శాలువా, పూలమాలలు వేసి సన్మానించారు. మత పెద్దల ప్రత్యేక ప్రార్థనల మధ్య కొబ్బరికాయ కొట్టి పారతో పనులు చేపట్టారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ ఒకటైన నూతన వధూవరులకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆశీస్సులు అందజేశారు. మండలంలోని తుంగభద్ర గ్రామంలో జరిగిన వివాహ వేడుకల్లోను, ఎమ్మిగనూరు మండలం హనుమాపురం వద్ద ఉన్న విశాల గార్డెన్‌లో జరిగిన పెళ్లి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కల్యాణ మండపం వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శాలువా, పూలమాలలు వేసి సన్మానించారు. వైసిపి మండల ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి, కోసిగి మండల ఇన్‌ఛార్జీ మురళీ మోహన్ రెడ్డి, నాయకులు కాంతా రెడ్డి, మధు సూదన్ రెడ్డి, ఉదరు కుమార్ రెడ్డి, దశరథ రెడ్డి, దొడ్డి బెళగల్ నర్సన్న ఉన్నారు.
ఎమ్మెల్యేను సన్మానిస్తున్న ఆదిశేష నాయుడు










