ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని గ్రామాల్లో పేదలకు ఇస్తున్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, ఈ మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అమరావతిలోని రాజధాని గ్రామాల్లో మొత్తం 51 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నారు. రాజధాని రైతులు రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఇప్పటికే వేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల 26న సిఎం ద్వారా ఇళ్ల పట్టాల పంపిణీకి కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పట్టాల భూమికి ముందస్తుగా మౌలిక సదుపాయాలతో లే అవుట్‌ల ఏర్పాటుకు రూ.50 కోట్లు కేటాయించారు. పట్టాల పంపిణీ పూర్తయిన వెంటనే ఇళ్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయాలని యోచిస్తున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి నిధులు మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే 51,392 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని యోచిస్తున్న ప్రభుత్వం 47 వేల మందికి ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు కేటాయించి నిర్మించేలా చర్యలు చేపట్టాలని, మరో నాలుగు వేలమంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రతిపాదనలు యోచిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకోగలిగే వారి కోసం స్ధలాలు కేటాయించి, మిగతా వాటిలో తామే ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సహకరించాలని కేంద్రాన్ని కోరింది. టెక్నాలజీతో ఇళ్లు కట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినప్పుడే మంజూరు పత్రాలూ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇళ్ల స్థలాలలో మౌలిక సదుపాయలు, లేఅవుట్ల అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించిన సిఆర్‌డిఎ లేఅవుట్ల అభివృద్ధికి ఇప్పటికే రూ.20 కోట్లు ఖర్చు చేసింది.
గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాల బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతరం, నెక్కల్లు, కురగల్లు, నిడమర్రు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు గ్రామాల్లో లే అవుట్‌ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. రాజధాని రైతులు ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా స్థలాలు ఇవ్వకుండా స్టే ఉత్తర్వులు రాలేదు. కోర్టు నుంచి ప్రస్తుతానికి ఇబ్బందులేమీ లేకపోవడంతో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే సిఆర్‌డిఎ, మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు, గుంటూరు కలెక్టర్, ఇతర అధికారులు లే అవుట్‌ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. మునిసిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు రాజధాని గ్రామాలను సందర్శించి పట్టాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.










