వేసవిలో వెంటాడుతున్న దొంగల భయం
ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను వినియోగించుకోవాలని పోలీసుల సూచన
ప్రజాశక్తి - మండవల్లి
వేసవి అంటేనే ప్రజలకు దొంగల భయం వెంటాడుతుంది. ఇంటిలో ఉక్కబోతతో ఆరు బయట నిద్రకు ఉపక్రమించినా, ఇంటికి తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లినా దొంగలు ఇదే అదునుగా భావించి చోరీలకు పాల్పడుతుంటారు. నేపథ్యంలోనే మండలంలో వేసవిలో ఎక్కువ దొంగతనాలు జరిగాయి. లక్షలాది రూపాయల నగదు, బంగారం, వెండిని దొంగలు అపహరించుకుపోయారు. కొన్నిరోజుల క్రితం మండవల్లి ఎస్‌సి కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిలోకి దొంగలు చొరబడి సుమారు రూ.నాలుగు లక్షల విలువచేసే బంగారు, వెండి నగలతో పాటు నగదును అపహరించుకుపోయారు. అలాగే తాళం వేసి ఉన్న ఐదు ఇళ్లల్లోకి దొంగలు ఒకేరోజు రాత్రి చోరీకి పాల్పడి సుమారు రూ.ఆరు లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలతో పాటు నగదును అపహరించుకుపోయారు. పోలీసునంటూ వాహనపత్రాలు చూపించాలని ద్విచక్ర వాహనదారుణ్ని ఆపి పట్టపగలే లక్ష రూపాయలు విలువచేసే బంగారు గొలుసును దొంగలించిన ఘటన కూడా మండలంలో చావలపాడలో చోటుచేసుకుంది. ఇలా వేసవి కాలంలో దొంగలు రెచ్చిపోయి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేసవికాలంలో ఇంటికి తాళం పెట్టి బంధువుల ఇళ్లకు వెళ్లి ఒక్క పూట నిశ్చింతగా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి.
సాధారణంగా వేసవిలో విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు ఎక్కువగా వెళ్తుంటారు. వేసవి సెలవులకు వెళ్లే క్రమంలో తమ విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఇంటిలోనే ఉంచి తాళం పెట్టి ఊర్లకు వెళ్తుంటారు. ఇదిలా ఉంటే వేసవిలో ఇంటిలోకి గాలి రావడంలేదని, ఉక్కబోతగా ఉంటుందని సేద తీరడానికి డాబాలపైన, లేదా తలుపులు బార్లా తీసి ఆదమరిచి మత్తుగా నిద్రపోతుంటారు. ఇదే అదునుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. పగటిపూట రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను, ఆదమరిచి నిద్రిస్తున్న వారి ఇళ్లను టార్గెట్ చేసి గుట్టుచప్పుడు కాకుండా దొంగతనానికి పాల్పడుతున్నారు. నిద్రలేచే సమయానికి దొంగలు ఇల్లంతా గుల్ల చేశారని గమనించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే వేసవిలో చోరీల నియంత్రణకు పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఊరి శివారులో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
లాక్డ్‌హౌస్ మోనటరింగ్ సిస్టంతో చోరీలకు చెక్
చోరీలకు చెక్ పెట్టే విధంగా పోలీసులు లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సమాచారం అందిస్తే ఇంటికి ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను అమర్చి కంటికి రెప్పలా కాపాడుతామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ సిస్టమ్‌ను వినియోగించుకుంటే ఇంటికి భద్రత ఉంటుందని చెబుతున్నారు.
ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను వినియోగించుకోండి
లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టం చోరీలు జరగకుండా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్‌ఐ టి.రామకృష్ణ తెలిపారు. చోరీలకు అడ్డుకట్టు వేసే విధంగా పోలీస్ శాఖ ఈ విధానం తీసుకొచ్చిందన్నారు. ప్రజలు ఊర్లకు వెళ్లే క్రమంలో విలువైన వస్తువులను జాగ్రత్తపరచుకోవాలన్నారు. ఇంటికి తాళం పెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లేవారు ముందుగా పోలీసులకు సమాచారం అందిస్తే లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం అమర్చి దొంగతనం జరగకుండా కంటికి రెప్పలా కాపాడుతామని చెప్పారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో పగలు, రాత్రి వేళల్లో కూడా పోలీసులతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఏదైనా ఆపద, అత్యవసర సమయాల్లో పోలీసులకు లేదా 100, 112 నెంబర్లకు సమాచారం అందించి సహాయం పొందొచ్చన్నారు. అవగాహన లేకపోవడం వల్ల ఈ సిస్టమ్‌ను చాలామంది వినియోగించుకోవడం లేదన్నారు. ఈ క్రమంలోనే చోరీలు పెరుగుతున్నాయన్నారు. ఈ సిస్టం వినియోగించుకోవడానికి ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగా అమరుస్తున్నామని తెలిపారు. చోరీలకు అడ్డుకట్ట వేయడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.










