ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ కాకినాడలో వృద్ధడు ఎం.శ్రీనివాస్ సాయంత్రం వాకింగ్ చేస్తుండగా ముసుగు ధరించి బైకుపై వచ్చిన ఆగంతకులు ఆయన దగ్గర ఉన్న డబ్బులు, సెల్ ఫోను లాకుకని పరారయ్యారు. దీనిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా నిందితులను పట్టుకునేందుకు ఎటువంటి ఆధారం లేకపోయింది. దేవాదాయశాఖ కార్యాలయం వద్ద గత ఆదివారం వాకింగ్ చేస్తున్న ఒక వృద్ధుని బైకుపై వచ్చిన ముగ్గురు తీవ్రంగా కొట్టి సెల్‌ఫోన్, బంగారం అపహరించుకుపోయారు. నిందితులు పట్టుకునేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కేసులు అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. కాకినాడలో జరుగుతున్న వాటిలో ఇవి మచ్చుకే.. కాకినాడ స్మార్ట్సిటీ తలమానికంగా నిలిచిన సిసిసి (కమాండ్ కంట్రోల్ సెంటర్ స్టెరిలైజ్) నిర్వహణలో ఎన్నో సేవలందించింది. ఇతర స్మార్ట్ సిటీ చైర్మన్లు, అధికారులు కూడా కాకినాడ సిసిని సందర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్టెరిలైజ్ సంస్థకు రూ.19.50 కోట్లు నిధులు బకాయిలు ఉండడంతో ఆ సంస్థ పక్కకు తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎటువంటి విద్యార్హతలు లేని ఒక వ్యక్తికి స్మార్ట్ సిటీ పగ్గాలు అప్పగించి. నెలకు రూ.1.60 లక్షలు జీతం చెల్లిస్తోంది. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అధికారులకు తెలిసి వచ్చింది. కొన్నిరోజులుగా సిసిసి సేవలు కాకినాడ ప్రజలకు అందక నగరంలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధాన కూడల్లో ట్రాఫిక్ సిగల్స్ పనిచేయకపోవడంతోపాటు టోల్ ఫ్రీ, వైఫై, కొన్నిచోట్ల సిసి కెమెరాలు, నెంబర్ ప్లేట్లు, ఫేస్ రికగేషన్, విఎండిలు, పబ్లిక్ ఎనౌన్స్ మెంట్లు, ఎస్‌విఎస్‌లు ఇలా సిసిసి ఆధ్వర్యంలో 1,449 ఎలిమెంట్స్ పని చేయాల్సి ఉండగా ప్రస్తుతం 735 ఎలిమెంట్స్ డౌన్ అయ్యాయి. దీంతో ఈ సేవలు అన్నీ నిలిచిపోయాయి. సిసిసి ఆధారంగా నగరంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అధికారుల సమన్వయంతో క్షణాల్లో పరిష్కరించేవారు. సిసిసి సేవలు నిలిచిపోవడంతో ఇప్పుడు పలు సమస్యలు పెరిగిపోయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఎన్ని షోకాజ్‌లు ఇచ్చిన సిటిఒ గైర్హాజరు
సిసిసి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సిటిఒ (చీప్ టెక్నికల్ ఆపీసర్), రామారావు గౖర్హాజరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గైర్హాజరుతోనే సిసిసిలో పలు సమస్యలు తలెత్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారులకు గానీ, సిబ్బందికి గానీ ఎటువంటి సమాచారం లేకుండా ఆయనకు ఆయనే సెలవు ప్రకటించుకోవడం విశేషం. ఆయనకు ఎటువంటి ఆహ్వానం లేకపోయినా గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన స్మార్మ్ సిటీల సదస్సులో ప్రత్యేక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్టెరిలైజ్ బాధ్యతలు నుంచి తప్పుకున్న తరువాత కొత్త కంపెనీకి టెండర్ నోటీసు ఇవ్వడానికి స్మార్ట్ సిటీ ఎస్‌ఇ సత్యనారాయణరాజు సమాచారం అడిగినప్పటికీ సిటిఒ స్పందించక పోవడంతో షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై ఎస్‌ఇ తనను వేధిస్తున్నారంటూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మినిస్టరీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ ఎపెర్స్, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకినాడ స్మార్ట్ సిసిసి అంశం హాట్ టాపిక్ గా మారింది. అనుమతులు లేకుండా సిటిఒ గుజరాత్ వెళ్లడంపై స్మార్ట్ సిటీ ఎండీ, నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్.నాగనరసింహారావు రెండోసారి షోకాజ్ నోటీసు ఇచ్చారు. కొన్నిరోజులు ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై మూడో షోకాజ్ నోటీసు ఇచ్చారు. గత కమిషనర్ సమయంలో కూడా పలు షోకాజ్ నోటీసులు తీసుకున్నా ఆయనపై ఎటువంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. స్మార్ట్ సిటీ ఉద్యోగులతో కూడా ఆయనకు సఖ్యత లేకపోవడంతో సిబ్బంది అంతా కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. గతంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ పరిధిలో సిసి కెమెరాలు పని చేస్తుండగా, స్మార్ట్ సిటీ వాటిని తీసి వీటిని ఉపయోగించారు. ఇప్పుడు అవి పని చేయక, వీటిని అందుబాటులోకి తీసుకురాక అధికారుల తలలు పట్టుకుంటున్నారు. కాకినాడలో విచ్చలవిడిగా దొంగతనం, గంజాయి కేసులు పెరుగుతున్నా వీటిపై నిఘా పెట్టడంలోఅటు పోలీసు అధికారులు, వీటి కార్పొరేషన్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దేనితో నిత్యం కాకినాడ రాష్ట్రవ్యాప్తంగా ఏదో విధంగా మారు మోగుతూనే ఉంది.










