ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : నిడమర్రులో సుమారు 4 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్ల పట్టాలను నిడమర్రు, నవులూరు గ్రామాల్లో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిడమర్రు వైయస్సార్ జగనన్న నగర్ నందు 544 ఫ్లాట్లు నిర్మించగా లోన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి 430 మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చామని చెప్పారు. ఇంకా 114 మందికి లోన్ రావడం లేదని, సివిల్ స్కోర్ సమస్య వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పారు. త్వరలోనే బ్యాంక్ వారితో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించి మిగిలిన వారికి కూడా ఇళ్ల పట్టాలిస్తామని అన్నారు. నవులూరు టిడ్కో లే అవుట్‌లో 672 ప్లాట్లు నిర్మించగా ఇందులో 563 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని, మరో 109 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ జరగలేదని, బ్యాంక్, టిడ్కో అధికారులతో మాట్లాడి వారికి కూడా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేస్తామని వివరించారు. లబ్ధిదారులందరూ తమకు కేటాయించిన ఇళ్లలో అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని, సమస్య ఉంటే అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. ఇళ్లల్లో కబోర్డులు చేయించుకోవడానికి గాళ్లు కొట్టడం, గోడలు పగలగొట్టడం వంటివి చేయొద్దని, దీనిపై అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఇళ్ళకు సంబంధించి విద్యుదీకరణ స్విచ్చులను ఎమ్మెల్సీ ఆన్ చేసి ప్రారంభించారు.










