ప్రజాశక్తి -కంచరపాలెం : ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలను ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనిరాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కేసలి అప్పారావు, సభ్యులు గొండు సీతారాం అన్నారు. సోమవారం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో జ్ఞానాపురం జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో నిర్వహించిన సమావేశంలో బాలల సమస్యలపై చర్చించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలు ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పునరావృతం కాకుండా సరిచేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. పాఠశాలల్లో శారీరక దండనలు చేస్తే క్రిమినల్ చర్యలకు ఆదేశాలిస్తామన్నారు.తరగతి గదుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.పాఠశాల నోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలతో పాటు, 1098 చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్‌తో పాటు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెయిల్ అడ్రస్‌లు ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ సెలవులు, రెండోశనివారం, ఆదివారం, పండగ దినాల్లో తరగతులు నిర్వహిస్తే సహించబోమని హెచ్చరించారు. శిథిలమైన, అపరిశుభ్ర, వెలుతురు, గాలి లేని గదుల్లో తరగతులను నిర్వహించొద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాశాఖాధికారి గౌరీ శంకర్, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి మమత, సిబ్బంది అనిజ, చైల్డ్ లైన్ ప్రతినిధి డేవిడ్ రాజు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్రతినిధి భాస్కర రావు, జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రతినిధి వెంకటరెడ్డి పాల్గొన్నారు.










