Jul 26,2023 22:05

సమావేశంలో మాట్లాడుతున్న జెసి నవీన్‌

- జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
ఆరోగ్యశ్రీ ట్రస్టు నిబంధనలను ఉల్లంఘించి, రోగులకు సకాలంలో వైద్యం అందించని ఆస్పత్రులపై చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ఆస్పత్రుల్లో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. రానున్న సీజన్ల వారీగా గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా ఆస్పత్రులు సిద్ధం చేసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఎలాంటి నోటీసు వచ్చినా సకాలంలో స్పందించాలని, సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. రిమ్స్‌ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ప్రతిరోజూ క్రానిక్‌ ఒపి అందుబాటులో ఉంచి, రోగులపై స్నేహపూరిత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పొగిరి ప్రకాశరావు, డిసిహెచ్‌ఎస్‌ భాస్కరరావు, పలు ఆస్పత్రుల ప్రతినిధులు సోమేశ్వరరావు, ప్రవీణ్‌కుమార్‌, కె.దుర్గాప్రసాద్‌, సాగరిక, చంద్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.