Oct 21,2022 23:20

బాణాసంచా విక్రయస్థలాలను పరిశీలిస్తున్న ఎసిపి, సిఐ

ప్రజాశక్తి - కంచరపాలెం : బాణసంచా విక్రయాలకు అనుమతులు పొందేవారు నిర్ధేశించిన భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఐదో జోన్‌ కమిషనర్‌ ఆర్‌జివి.కృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం బిర్లా జంక్షన్‌ సేవామార్గ్‌ను ఆనుకొని ఉన్న ఖాళీ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేయనున్న మూడు బాణాసంచా దుకాణాలను నేరుగా పరిశీలించారు.
దీపావళి బాణసంచా విక్రయాలకు దరఖాస్తులో పేర్కొన్న స్థలాన్ని పరిశీలించి, నిబంధనలకు అనుకూలంగా ఉంటే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఇదే సమయంలో దుకాణాలకు జివిఎంసి, అగ్నిమాపకశాఖల అనుమతులుండాలని, తాత్కాలిక దుకాణాలైనా వాటి పైకప్పునుసిమెంట్‌, జిఐ రేకులతో నిర్మించాలని, దుకాణాల మధ్య కనీసం మూడు మీటర్లు దూరం ఉండాలన్నారు. మండే స్వభావం కలిగిన వస్తువులను దుకాణంలో ఉంచరాదని, 100 కిలోలకు మించి బాణసంచా నిల్వలను ఉంచరాదన్నారు. దుకాణాల వద్ద అగ్నిప్రమాదాల నివారణకు 200లీటర్ల సామర్ధ్యం గల డ్రమ్మును నీటితో నింపి ఉంచాలని,అలాగే నిండా ఇసుకతో రెండు బకెట్లును సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రమాదవశాత్తు మంటలు రేగితే ఆర్పేందుకు ఫైర్‌ ఎక్వీప్‌మెంట్‌ ఉండాలన్నారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌కు ఆస్కారం లేకుండా నాణ్యమైన వైర్లను వాడాలన్నారు. పార్కింగ్‌కు దూరంగా దుకాణాలను ఏర్పాటు చేయడంతోపాటు దుకాణాల వద్ద ఫైర్‌, పోలీసుశాఖలకు చెందిన అత్యవసర ఫోను నెంబర్లుతో బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సచివాలయం టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది, స్టాల్స్‌ నిర్వాహకులు వేణుగోపాల్‌, రంజిత్‌, సంతోష్‌ పాల్గొన్నారు.
ములగాడ :బాణసంచా విక్రయదారులు నిబందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మల్కాపురం సిఐ లూధర్‌బాబు హెచ్చరించారు. శుక్రవారం హార్బర్‌ ఇన్‌ఛార్జి ఎసిపి శ్రావణ్‌కుమార్‌ వెంట శ్రీహరిపురం కోరమండల్‌ గ్రౌండ్‌లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు, నిబంధనలన్ని కచ్చితంగా పాటించిన వారికే దీపావళి దుకాణాలకు అనుమతుల వస్తాయన్నారు. ఈ సందర్భంగా దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి తగు సూచనలు చేశారు.