Jul 03,2023 19:27

ఎంఇఒ కోమలదేవికి వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
నిబంధనలు పాటించని ప్రయివేట్‌ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఎంఇఒ కోమల దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పోతురాజు, అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఆలూరులో సాయిశ్రీ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను శ్రీచైతన్య పేరుతో మభ్యపెట్టి రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. పాఠశాలలకు బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, వివిధ గ్రామాల నుంచి పరిమితికి మించి ఆటోల్లో విద్యార్థులను పాఠశాలకు తీసుకొస్తున్నారని చెప్పారు. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన వేళలు కాకుండా సాయంత్రం 4.30 గంటల వరకు పాఠశాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి తరగతులకు సంబంధించిన 3, 4 ఏళ్లు గల చిన్న పిల్లలు ఉన్నారన్నారు. ఆ సమయం వరకు పాఠశాల నిర్వహిస్తే పిల్లలు మానసికంగా క్షీణించి, అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. సెయింట్‌ జాన్స్‌ పాఠశాల యాజమాన్యం కూడా బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను గ్రామంలో నుంచి పాఠశాలకు తీసుకొస్తున్నారని తెలిపారు. విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా కొనసాగుతున్న పాఠశాల యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు గోవర్ధన్‌, రవీంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు గిరి మూర్తి, ధనంజరు, ఉమేష్‌ పాల్గొన్నారు.