ప్రజాశక్తి-బాపట్ల: ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ విద్యాసంస్థలు బేఖాతరు చేస్తున్నాయి. సెలవు రోజుల్లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు తరగతులు నిర్వహించడంపై భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం సెలవు దినం అయినప్పటికీ ప్రైవేటు విద్యా సంస్థలు యథేచ్ఛగా తరగతులు నిర్వహించాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. విద్యా సంస్థలకు సెలవు అయినప్పటికీ తరగతులు నిర్వహించడంపై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆర్య మాట్లాడుతూ బాపట్ల పట్టణంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇది విద్యా సంస్థల యాజమాన్యాల బరితెగింపా? లేక విద్యా శాఖ అధికారుల చేతకానితనమా? అని ఆర్య ప్రశ్నించారు. జిల్లా విద్యా శాఖ అధికారి, మండల విద్యా శాఖ అధికారి కార్యాలయాలకు సమీపంలోనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలున్నాయని, అయినా ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పట్టణంలో వివేకా ఫాస్టర్ హైస్కూల్లో తరగతులు నిర్వహిస్తున్నారని, వీటిపై అధికారులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే విద్యార్థులతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్, ఇంటర్ కాలేజీల పరిస్థితి ఇదే విధంగా ఉందని, పట్టణంలో ఉన్న కేవలం నాలుగు ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలపై పర్యవేక్షణ అవసరమని అన్నారు. పట్టణంలో చైతన్య విజిఆర్‌ఎం, జూనియర్ కళాశాలలు సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నా విద్యా శాఖ అధికారులు చర్యలకు పూనుకోవడం లేదన్నారు. జిల్లా అధికారుల పనితీరు మార్చుకోకుంటే ఎస్‌ఎఫ్‌ఐ చూస్తూ ఊరుకోదని, ఉన్నతాధికారులకు బలమైన కారణాలతో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.










