Jun 24,2023 18:10

సమావేశంలో మాట్లాడుతున్న పట్టణ కార్యదర్శి శివ

నిబంధనలు పాటించని ప్రైవేట్‌ హాస్టళ్లు
- చర్యలు తీసుకోవాలి : డివైఎఫ్‌ఐ
ప్రజాశక్తి - నంద్యాల

    నంద్యాలలో అనుమతి లేకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నడుపుతున్న ప్రైవేట్‌ హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి శివ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక డివైఎఫ్‌ఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు, కోచింగ్‌ తీసుకుంటున్న యువతీ యువకులను ఆసరా చేసుకుని కొత్త కొత్త పేర్లతో రోజుకు ఒక్క హాస్టల్‌ పెడుతూ వేలకు వేలు ఫీజు తీసుకుంటూ నడుపుతున్నారని అన్నారు. ఒక రూమ్‌లో ఆరుగురిని పెడుతున్నారని, కనీసం రోజువారి మెనూ కార్డు కూడా ఏమాత్రం పెట్టకుండా నడుపుతున్నారని తెలిపారు. మరికొన్ని హాస్టల్లో సమయానికి భోజనం పెట్టడం లేదని, పెట్టినా భోజనం బాగోలేక విద్యార్థులు యువతీ యువకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తక్షణమే అధికారులు స్పందించి నిబంధనలు పాటించకుండా నడుపుతున్న ప్రైవేట్‌ హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పట్టణ నాయకులు వినీత్‌, సంజరు, శ్రీను, ప్రవీణ్‌, గౌతమ్‌, శివరాం తదితరులు పాల్గొన్నారు.