ప్రజాశక్తి - విజయపురిసౌత్ : నర్సరీ యజమానులు నర్సరీ చట్టం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఉద్యాన అధికారి ఎన్.సురేష్ అన్నారు. వెల్దుర్తి మండల పరిధిలోని మందాడి, బోదెల వీడు, గుండ్లపాడు గ్రామాల్లోని షేడ్‌నెట్ నర్సరీలను ఆయన శుక్రవారం పరిశీలించారు. లైసెన్స్ లేని నర్సరీలకు, రిజిస్టర్లు లేని నర్సరీలకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీ నిర్వాహకులు నర్సరీ చట్టం 2010 ప్రకారం నర్సరీ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. నర్సరీ లైసెన్స్ కోసం షేడ్ నెట్ చుట్టూ 8 నుంచి 14 అడుగుల ఎత్తు వరకు ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్టుతో రక్షణ కల్పించాలని చెప్పారు. షేడ్ నెట్ హౌస్‌లో డబుల్ డోర్ సిస్టం కలిగి ఉండాలని, పైన ఉన్న నెట్‌కు గాని ఇన్సెక్ట్ నెట్‌కు గాని కీటకాలు లోపల ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. మిరప విత్తనాలను పోట్రేలలో నాటి వాటిని ఎత్తయిన మడులపై అమర్చాలని పోట్రేలలో శుద్ధి చేసిన కోకో పీట్ మాత్రమే వాడాలని చెప్పారు. కోకో పీట్‌ను శుద్ధి చేయుటకు ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి, ఒక కిలో సూడోమోనాస్ కలపాలని వివరించారు. నర్సరీ యజమానులు విత్తనాన్ని కొనుగోలు చేసినప్పుడు విత్తనాల ప్యాకెట్ మీద విత్తన రకము, లాట్ నెంబరు, కంపెనీ యొక్క లేబుల్‌ను గమనించి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. విత్తనాలు కొన్న ఒరిజినల్ రసీదులను భద్రపరచుకుని నర్సరీ రిజిస్టర్‌లలో నమోదు చేసుకోవాలన్నారు. నర్సరీ లైసెన్సు లేని ప్రతి ఒక్కరు లైసెన్స్ కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, కొత్తగా షేడ్ నెట్ నర్సరీలు వేసిన వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని లైసెన్స్ పొందాలని చెప్పారు. లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిన నర్సరీలు ఉన్నట్లయితే ఆ నర్సరీ యజమానులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రైతులకు నాసిరకం నారు అందించే నర్సరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ధరలకు విక్రయించినా చర్యలుంటాయన్నారు. కార్యక్రమంలో బోదుల వీడు విహెచ్‌ఎ భాను కుమార్, ఎంపిఇఒ శివ నాయక్, నర్సరీ యజమానులు, రైతులు పాల్గొన్నారు.










