Jun 02,2023 19:23

పింఛనుదారులతో వాలంటీరు

ప్రజాశక్తి - ఆదోని
పార్టీలకతీతంగా లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన కొందరు వాలంటీర్లు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం పాకులాడుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదోని పట్టణంలోని 1వ వార్డు వాల్మీకి నగర్‌లో టిడిపి కౌన్సిలర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదని పలు సందర్భాల్లో ఆమె అధికారులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అధికార పార్టీ నాయకులకు కొందరు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. ఇంటింటికీ తిరిగి వృద్ధులకు పింఛను ఇవ్వాల్సిన వాలంటీరు ఒకే చోటకు అందరిని పిలిపించి కరపత్రాలు ఇస్తూ పథకాలను వివరించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకొని వాలంటీర్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లగా విచారించి వివరాలు తెలుసుకుంటామని తెలిపారు.