ప్రజాశక్తి - కౌతాళం
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ ఎరిషావలీ, ఎస్‌ఐ నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా అధికారులు ఉత్తర్వుల మేరకు కౌతాళం ఎస్‌ఐ నరేంద్ర కుమార్ రెడ్డి తన సిబ్బంది వీరేష్, నరేంద్ర, హుస్సేన్ బాష, వీరభాస్కర్, రంగన్నతో కలిసి తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. వల్లూరు గ్రామ శివారులో గల తుంగభద్ర నది ఒడ్డున కోసిగి గ్రామానికి చెందిన తోవి వినోద్ కుమార్, కుప్పగల్ శీను, గోవిందు, నడిగేరి ఊరుకుంద, ఎ.రాజులు కర్ణాటకలోని మాన్వి వైన్ షాపు నుండి కర్ణాటక మద్యం తక్కువ రేటుకు కొనుగోలు చేశారని తెలిపారు. నది ఆవలి వైపు నుంచి ఒక తెప్ప సహాయంతో నది ఈ వైపునకు తెచ్చినట్లు చెప్పారు. రెండు మోటార్ సైకళ్లపై వేసుకొని చుట్టుపక్కల గ్రామాల వారికి అమ్మడానికి వెళ్తుండగా వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న మద్యం బాక్సులను, రెండు మోటార్ సైకళ్లను, 12 సెల్ ఫోన్లు, ఒక తెప్పను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
అక్రమ మద్యంతో ఉన్న పోలీసులు










