నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ప్రజాశక్తి-సీతారామపురం : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమిస్తే చర్యలు తప్పవని నెల్లూరు టౌన్, కోవూరు సర్కిల్స్‌కి చెందిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐ ఎన్.వి. రాఘవయ్య హెచ్చరించారు. బుధవారం మండలంలోని రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రాపూరు, ఉదయగిరి సర్కిళ్లకు సంబంధించిన ప్రభుత్వ మద్యం దుకాణాలలో క్రాస్ చెకింగ్ చేస్తున్నామని అందులో భాగంగా బుధవారం ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను తనిఖీ చేస్తున్నామన్నారు. దుకాణంలో మద్యం బాటిళ్లు అమ్మకాలు జరిపిన నగదును లెక్కించామని, మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిపిన నగదును మరుసటి రోజు క్రమం తప్పకుండా సక్రమంగా బ్యాంకులో జమ చేయాలన్నారు. బ్యాంకులో జమ చేసిన నగదు రసీదులను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ప్రభుత్వం నిర్థేశించిన సమయం ప్రకారం షాపులను నిర్వహించాలన్నారు. అదేవిధంగా రికార్డులలో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుండాలన్నారు. ప్రతి బాటిల్‌ను స్కాన్ చేసే అమ్మాలన్నారు. మద్యం బాటిళ్లను ఎంఆర్‌పి కంటే ఎక్కువకు అమ్మరాదని, అట్లు అమ్మినవారిపై చర్యలు తప్పవన్నారు. ఎక్కడైనా బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వారి వివరాలను వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రికార్డులు నగదు సక్రమంగా ఉన్నాయన్నారు. మళ్లీ కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సిబ్బంది మాస్కులను ధరించాలని పలు సూచనలు సలహాలు ఇచ్చారు.










