ప్రజాశక్తి బాపట్ల
బాపట్ల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బై లా లోని అంశాలకు విరుద్ధంగా బ్యాంక్ చైర్మన్ ఎన్నిక సభ్యులతో నిర్వహించడం ఏమిటని కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరావు ప్రశ్నించారు. బ్యాంకు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న అడ్డగోలు పరిణామాలపై ఆయన విలేకరులతో శనివారం మాట్లాడారు. బాపట్ల కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్న కొల్లిమర్ల సత్యనారాయణ ఈ ఏడాది జూన్ 30న మరణించారని గుర్తు చేశారు. 8మంది కార్యవర్గ సభ్యులు ఉన్న అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశాన్ని జూలై 27న ఏర్పాటు చేశారని తెలిపారు. సభ్యులు హాజరు తక్కువ కావడంతో కోరం లేక సమావేశం వాయిదా వేశారని అన్నారు. జూలై 31న వైస్ చైర్మన్‌గా ఉన్న తనను చైర్మన్ బాధ్యతలు నిర్వహించాల్సిందిగా జిల్లా కోపరేటివ్ అధికారి ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఆగస్టు 3న తిరిగి సర్వసభ్య సమావేశం నిర్వహించామని తెలిపారు. సమావేశానికి సరిపడా సభ్యులు హాజరు కాలేదని తెలిపారు. జి వెంకటేశ్వర్లు మరో ఐదు మంది సభ్యులు బాపట్ల కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌కు ఎన్నికలు జరపాలని ఆగస్టు 11న జిల్లా కలెక్టర్‌కు లేఖ పంపినట్లు ఆగస్టు 18న బ్యాంక్ సీఈవో తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఆగస్టు 26న అర్బన్ బ్యాంక్ చైర్మన్‌కు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఈనెల19న ఇచ్చిన ఉత్తర్వులను తమకు 21న ఇచ్చారన్నారు. ఈనెల 26న జరిగే ఎన్నికలకు హాజరు కావాలని తమకు నోటీసు ద్వారా తెలియజేసినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ఎన్నికల అధికారిని నియమిస్తున్నట్లు అలేఖలో పేర్కొన్నారు. తాము చైర్మన్ హోదాలో మూడుసార్లు నిర్వహించిన సమావేశాలకు సభ్యులు హాజరు కాలేదని, బ్యాంక్ సీఈవో బ్యాంక్ బైలాకు విరుద్ధంగా చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోరినట్లు తెలిపారు. తాము కాపు సామాజిక వర్గం అని ఒక వర్గం నాయకులే ఇక్కడ చైర్మన్ పదవిని చేజించుకోవాలని రాజకీయంగా ఓ నాయకుడు చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఎన్నికలని ఆరోపించారు. బ్యాంకు పాలకవర్గాన్ని రద్దుచేసి తిరిగి తాజాగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న చైర్మన్ పదవి ఎన్నికల అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.










