Dec 19,2022 00:11

గుండాల ఇసుక ర్యాంపులో జెసిబితో తవ్వకాలు చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - ఎటపాక
గోదావరి చెంతనే గ్రామాలున్నా ట్రక్కు ఇసుక కావాలంటే ఒక యజ్ఞం చేయాల్సిందే. గిరిజనులు ఇల్లు కట్టుకోడానికి, మిర్చి కల్లాల్లోకి ఇసుక కావాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాలి. స్థానిక అధికారుల నుండి ఐటిడిఎ అధికారుల వరకు అనేక ఆంక్షలు పెడుతున్నారు. ఎవరైనా ధైర్యం చేసి ఇసుక తోలుతే కేసుల వరకు వెళ్ళాల్సిందే. అలాంటిది మండలంలోని గుండాల ఇసుక రాంపులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తూ పక్క రాష్ట్రాలకు లారీల్లో తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ ఇసుక ర్యాంపు పెద్దలకు కాసుల పంటగా మారింది. లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను పక్క రాష్రాలకు తరలిస్తూ ప్రజా సంపదను దోచుకుంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తే అనుమతులున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. అనుమతుల విషయం పక్కన పెడితే, ఇక్కడ ఇసుక అమ్మకం కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రం చత్తీస్‌ఘడ్‌ వేబిల్‌తో ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 20 నుంచి 30 వరకు లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
గిరిజన చట్టాలు బేఖాతరు...
ఏజెన్సీలో ఎటువంటి ఖనిజ సంపద తవ్వకాలు చేయాలన్నా 1/70, పీసా చట్టాల ప్రకారం గ్రామసభ నిర్వహించి స్థానిక పంచాయతీ అనుమతి పొందాల్సి ఉంది. గ్రామసభ ఆమోదం లేకుండా ఏ అధికారికీ ఖనిజ సంపద తవ్వకాలకు అనుమతులు ఇచ్చే అధికారం లేదు. అసలు గ్రామసభే నిర్వహించలేదని, ఇక్కడ ఇసుక తవ్వకాలకు తమ పంచాయతీ నుంచి ఎటువంటి ఆమోదం తెలియజేయలేదని స్థానిక పంచాయతీ నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజన సొసైటీలకు మాత్రమే క్వారీ నిర్వహించే అధికారం ఉంది. అది కూడా మనుషులతో మాత్రమే తవ్వకాలు చేయాలి. నిబంధనలు ప్రకారం ఏజెన్సీలో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపు నిర్వహణ చేయడానికి వీల్లేకపోగా, ఇక్కడ గిరిజనేతరులు, అందులోనూ స్థానికేతరులు జెసిబిలతో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను, గిరిజన చట్టాలను తుంగలో తొక్కి గుండాల ఇసుక ర్యాంపుకు అనుమతులు ఎలా ఇచ్చారని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల చట్టాలకు, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న గుండాల ఇసుక ర్యాంప్‌ను మూసివేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని గిరిజన సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.

నిర్వాహకులు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
గుండాల ఇసుక ర్యాంప్‌కు ఏ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇచ్చారు? ఏజెన్సీలో గిరిజనేతరులకు ఇసుక ర్యాంప్‌ కేటాయించడం చట్ట వ్యతిరేకం. ఇసుక ర్యాంపు నిర్వాహకులపై, అనుమతులు ఇచ్చిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తక్షణమే గుండాల ఇసుక ర్యాంపును మూసివేయాలి. లేకుంటే ప్రజలతో ఇసుక క్వారీ ముట్టడిస్తాం. మూసివేసేదాకా పోరాడుతాం.
- కాకా అర్జున్‌ దొర, ఎపి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు