Sep 15,2023 15:51

నెలవారీ సమీక్షలో : డిఆర్‌డిఎ పిడి విజయరాజు
ప్రజాశక్తి - భీమడోలు
   ఫిర్యాదుదారుల సంతృప్తి మేరకు నిబంధనలకు లోబడి స్పందన ఫిర్యాదులను పరిష్కరించాలని డిఆర్‌డిఎ పిడి, మండల పరిషత్‌ అధికారి ఆర్‌.విజయ రాజు కోరారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం స్పందన ఫిర్యాదులు, 12 ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై నెలవారీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి సిహెచ్‌ పద్మావతి దేవి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన ఫిర్యాదుల పరిష్కారాన్ని పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. తిరిగి వాటిపై ఫిర్యాదుదారుడు తన సమస్య పరిష్కారం కాలేదంటూ మరొకమారు ఫిర్యాదు చేసేందుకు అవకాశం లేని విధంగా సమస్యల పరిష్కారం ఉండాలన్నారు. సమస్యలను పరిష్కరించే సమయంలో ఫిర్యాదుదారులు తొలిసారి సంతృప్తి లేదా అసంతృప్తి చెందినట్లు తన అభిప్రాయం తెలిపిన తర్వాత సదరు ఫిర్యాదుదారులకు ఉన్నతాధికారుల నుంచి సమస్య పరిష్కారం విషయమై ఆరా తీసేందుకు ఫోన్‌ వచ్చే అవకాశం ఉందని తెలపాలన్నారు. ఫిర్యాదుదారులతో ఇకెవైసి చేయించిన తర్వాతే సదరు సమస్య పరిష్కారమైనట్టు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇదేక్రమంలో సమస్య పరిష్కారంపై ఫిర్యాదుదారులు తన అసంతృప్తిని ఒకసారి మాత్రమే తెలిపే అవకాశం ఉందన్నారు. దీనిపై అధికారులు స్పందించి వారం రోజుల లోపల సదరు సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కోరారు. తాజాగా అత్యున్నత స్థాయిలో నిర్వహించిన స్పందన సమస్యల వివరాలను ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేసే ఏర్పాటు చేసిందన్నారు. 'జగనన్నకు చెబుదాం' సమస్యల పరిష్కారంలో సైతం అధికారులు ఇవే విధానాలు పాటించాలని ఆయన కోరారు. 187 మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఉపాధి చట్టం ద్వారా మంజూరు కావలసిన 90 రోజుల వేతన బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గత మూడు నెలల కాలంగా వచ్చిన స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో మండలంలోని ఫిర్యాదుదారులు సంతృప్తి సుమారు 50 శాతం మాత్రమే ఉందని, ఈ సంఖ్యను తగ్గించుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశాలకు హాజరుకాని అధికారుల వివరాలు జిల్లా కేంద్రానికి తెలపాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న భీమడోలు వ్యవసాయ అధికారి మండలంలో 70 శాతం ఇకెవైసి కార్యక్రమం పూరైందన్నారు. భీమడోలు పంచాయతీ విస్తరణ అధికారి సుందరి మాట్లాడుతూ మండలంలో రూ.5.71కోట్ల టాక్స్‌లకు గాను రూ.3.70 కోట్లు మాత్రమే వసూలయ్యాయన్నారు. ఇదేవిధంగా నాన్‌ టాక్స్‌లుగా రూ.2.71 కోట్లు గాను రూ.2.10 కోట్లు వసూలయ్యాయని తెలిపారు. గ్రామపంచాయతీలు విద్యుత్‌ బిల్లుల కింద రూ.6 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉందని, ఇవన్నీ వసూలు కానీ కారణంగా గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య, అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడక నడుస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన గ్రామపంచాయతీ కార్యదర్శులు పలువురు ఆర్థిక సంఘం ద్వారా తమ గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధుల నుంచి ఇప్పటికే విద్యుత్‌ బిల్లులకు కోతలు కోసి మిగులు మొత్తాన్ని తమకు పంపుతున్నారని, దీని కారణంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత కూడా ఏర్పడుతుందని అన్నారు. విద్యుత్‌ బిల్లుల బలవంతపు వసూళ్లు తర్వాత సైతం తిరిగి బకాయిలంటూ అధికారులు అనడాన్ని వారు తప్పుపట్టారు. ఆ తర్వాత శాఖల వారీగా అధికారులు తమ శాఖల ప్రగతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సమస్య ఎఇ.సతీష్‌, ఐసిడిఎస్‌ భీమడోలు ప్రాజెక్ట్‌ సిడిపిఒ విజయలక్ష్మి, వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం ఎపిఎం సురేష్‌ పాల్గొన్నారు.