Jul 12,2023 21:45

కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

పార్వతీపురంరూరల్‌: ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించి, ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఓటరు నమోదు అధికారులు, తహశీల్దార్లు ఇతర అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలను ప్రతి అధికారి తుచతప్పక పాటించాలన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్ల జాబితాను సంసిద్ధం చేయాలన్నారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఫారం-6 గురించి తెలియజేసి ఓటర్లగా నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులు, విఆర్‌ఒలపై ఉందని, తొలగింపులపై ఫారం-7 ద్వారా ప్రజలకు తెలియజేసి నోటీసు ఇచ్చి ఎందుకు ఓటు తొలగిస్తున్నామో ఓటరుకు తెలియజేసి మాత్రమే ఓటు తొలిగించాలని తెలిపారు. ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, ఇతర జిల్లాల్లో లేక నియోజకవర్గంలో అదనంగా నమోదై ఉంటే క్షుణ్నంగా పరిశీలించి తొలిగించాలని అన్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ, మెడికల్‌ కాలేజీల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కొత్తగా ఓటరు నమోదు చేయాలని తెలిపారు. ఓటరు జాబితాల్లో ఫోటో స్పష్టంగా ఉందో లేదో చూసుకొని పక్కా ఫోటో పొందుపర్చాలన్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలని, వలసలు వెళ్లిన వారి జాబితా పక్కాగా ఉండాలని, ఒకే ఇంట్లో 10 ఓట్లు మించి ఉంటే క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమంలో నిమగం అవుతూనే పోలింగ్‌ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన సదుపాయాలను పరిశీలించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మరుగుదొడ్లు, విద్యుత్‌, డబుల్‌ డోర్‌ రూమ్స్‌ తదితర సౌర్యాలు ఉన్నదీ లేనిదీ ఇప్పటి నుండే తనిఖీ చేయాలని సూచించారు. ఎన్నికలకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉంటే ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించవచ్చని, దీనికి ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయాలన్నారు. సమావేశంలో పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, డిఆర్‌ఒ జె.వెంకటరావు, డి.సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పిదాలు ఉండకూడదని ఐటిడిఎ పీవో కల్పన కుమారి అన్నారు. బుధవారం పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల బిఎల్‌ఒలతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ ఈనెల 21 నుంచి ఆగస్ట్‌ 21 వరకు ప్రతి బిఎల్‌ఒ ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి ఓటర్ల జాబితాలోని తప్పిదాలను సరిచేయాలన్నారు. సున్నా నంబర్‌తో ఉన్న ఇంటి పేర్లను జాబితాను బాగా పరిశీలించి వాటిని సరిచేయాలన్నారు. ప్రతి మండలంలో ఒక నోడల్‌ బిఎల్‌ఒను పెట్టుకోవాలన్నారు. ఫారం-8 ద్వారా తప్పులను సరిదిద్దుకోవాలన్నారు. బిఎల్‌ఒలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలాల తహశీల్దార్లు, డీటీలు, ఎన్నికల డీటీలు, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.