Aug 23,2023 00:24

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి-రంపచోడవరం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న భుహక్కు భూరక్ష కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను నిబంధనల ప్రకారం రీ సర్వే చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరం నుండి భూహక్కు భూరక్ష కార్యక్రమంపై రంపచోడవరం డివిజన్‌లోని రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల, వై.రామవరం, రాజవొమ్మంగి మండలాలకు చెందిన తహశీల్దార్లు, మండల, సచివాలయ సర్వేయర్లతో మంగళవారం పిఒ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏడు మండలాల్లో ఇప్పటివరకు ఎన్ని గ్రామాలలో, ఎన్ని ఎకరాలు రీ సర్వే చేసింది గ్రామాల వారిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రీసర్వే పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో రీ సర్వేకు సంబంధించిన వివరాలు ముందుగా వీఆర్వో లాగిన్‌లో పొందుపరచాలని సూచించారు. సర్వే టీంలు ఉదయం 6, 7 గంటలకల్లా ఫీల్డ్‌లో ఉండాలన్నారు. ఈ సర్వే చేసిన రైతులకు సంబంధించిన భూములకు రైతులకు నోటీసులు ఇచ్చి అనంతరం ఒక సమావేశం ఏర్పాటు చేసి రైతులు సంతృప్తి పొందిన ఎడల పూర్తి వివరాలు అప్లోడ్‌ చేయాలని ఆదేశించారు. ఏజెన్సీ ఏడు మండలాలలో ఇప్పటివరకు 253 గ్రామాలలో ఫీల్డ్‌ వర్క్‌ పూర్తయిందని తెలిపారు. రీ సర్వే ప్రారంభం కాని గ్రామాల భూములకు సర్వే చేసే ముందు రైతులకు తెలియపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధికారి కె.దేవేంద్రుడు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధికారి భీమశంకర్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ పరిపాలన అధికారి మడకం సావిత్రి, డిప్యూటీ తహశీల్దారు కె.సుధాకర్‌ బాబు పాల్గొన్నారు.