Jun 14,2023 22:37

ప్రజాశక్తి - ఏలూరు
        జిల్లాలోని జర్నలిస్టులకు నిబంధనల మేరకు అక్రిడిటేషన్ల సౌకర్యం మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ చెప్పారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధి వంటివారని, సమాజంలో జరుగుతున్న అవినీతిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ సౌకర్యం మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిఒ నెం.38 ద్వారా నిబంధనలు జారీ చేసిందని, ఆ నిబంధనలు అనుసరించి జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ సౌకర్యం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు గృహనిర్మాణ సంస్థ పీడీ నరసింహారావు, ఆర్‌టిసి రీజినల్‌ మేనేజర్‌ ఎన్‌విఆర్‌.వరప్రసాద్‌, పిఆర్‌ఒ నరసింహం, కార్మిక శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.శ్రీనివాస్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ టి.ఆండ్రులూయిస్‌, రైల్వే అధికారి కె.కిరణ్‌, కమిటీ సభ్యులైన మీడియా ప్రతినిధులు కె.కిషోర్‌, బాలశౌరి, బి.రవికుమార్‌, కె.ఉమామహేశ్వరరావు, షేక్‌ రియాజ్‌, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్‌.భవాని తదితరులు పాల్గొన్నారు.