Nov 12,2022 23:42

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి- చోడవరం :
నిబంధనలకు విరుద్ధ్దంగా దొడ్డిదారిన బదిలీలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ఇది కౌన్సిలింగ్‌ ప్రక్రియను తుంగలో తొక్కడమేనని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు ఆరోపించారు. పర్యటనలో భాగంగా శనివారం చోడవరంలో విలేకరులతో మాట్లాడుతూ సాధారణ బదిలీలు జరుగుతాయని ఉపాధ్యాాయులు ఆశిస్తున్న తరుణంలో, ప్రభుత్వం ఇలా అక్రమ బదిలీలు చేస్తోందన్న వార్తలతో ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో తమ సొంత జిల్లాలకు వెళ్లాలనుకునే వారికి తీవ్ర నిరాశకు గురిచేసే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బదిలీలు చేపడితే, సినీయర్‌ టీచర్లు, న్యాయంగా బదిలీ కావాల్సిన వారు, మారుమూల ప్రాంతాల్లోని వారు, ఎటువంటి సిఫార్సుల్లేని ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రస్తుతమున్న కౌన్సిలింగ్‌ విధానానికి వ్యతిరేకంగా, బదిలీల్లో సిఫార్సులకే ప్రాధాన్యత ఉంటుందన్న వార్తలపై నిజానిజాలు ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కౌన్సిలింగ్‌తో సంబంధం చేపట్టాలనుకునే బదిలీల ప్రక్రియను ఆపాలని కోరారు బదిలీలు, ఉద్యోగోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేసారు. అక్రమమార్గంలో బదిలీ ప్రక్రియ చేపట్టాలనుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బారు, అల్లూరి జిల్లా అధ్యక్షులు వై. విల్సన్‌బాబు, విశాఖ జిల్లా కోశాధికారి టిఆర్‌.అంబేద్కర్‌, చోడవరం మండల అధ్యక్షులు కె.కామరాజు, సీనియర్‌ నాయకులు డి. శ్రీనివాసు, ఎస్‌.జగ్గారావు, వి.సూర్యప్రకాష్‌, ఎస్‌.రాంబాబు, అప్పలమూర్తి పాల్గొన్నారు.