May 26,2021 07:29

   కెకెఆర్‌ అనబడే కోవెల కందాళై రంగనాథాచార్యుల పేరు సంప్రదాయాన్ని స్ఫురింపచేస్తుంది గాని దాంతో ఆయన తీరుకు పొంతన కుదరదు. ఎందుకంటే ఆయన అక్షరాలా ఆధునిక దృక్పథానికి ప్రతిరూపమనదగిన మేధావి. నిబద్దత, నిరాడంబరత్వం, నిమ్మళమైన నిక్కచ్చితనం వీటన్నిటినీ మించిన నిర్దుష్టత, నిపుణత ఆయన స్వంతం. సూటిగా సున్నితంగా విశ్లేషించడం, కొద్ది మాటలతో వివరించడం ఆయన పద్ధతి. కీర్తి కాంక్షకు దూరంగా మసలిన పండితుడు. తను చెప్పవలసిన అవసరం వుందనుకున్నది చెప్పవలసినంతవరకే చెబుతూ అందుకోసం అవసరానికి రెండింతలు అధ్యయనం చేస్తూ అర్థవంతమైన సార్థక జీవితం గడిపిన సాహిత్య జీవి. భాషావేత్త. సామాజిక భావుకుడు. సామయిక పరిశోధకుడు. అందుకే తెలుగు నాట విద్వత్‌ లోకంలో ఆయనది ఒక విలక్షణ బాణి. విభిన్న శ్రేణి.
   కెకెఆర్‌ తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనానికి చేసిన దోహదాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన నేపథ్యాన్ని, కాలాన్ని కూడా గుర్తుచేసుకోవాలి. హైదరాబాద్‌ సీతారాంబాగ్‌ ఆలయ ప్రాంతంలో తొలినాటి దిగంబర, విరసం కవులు జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌ వంటివారు అతి సన్నిహిత స్నేహితులుగా బయిలుదేరిన కెకెఆర్‌ విరసం తొలి ప్రకటన పైన కూడా సంతకం చేసి ఖమ్మం సభలకు కూడా హాజరైనారు. తర్వాత కాలంలోనూ తన ప్రగతిశీల భావజాలం మారకపోయినా విరసంలో లేరు. దిగంబర కవిత్వం తర్వాత విరసం ప్రాబల్యంలో పాత సాహిత్యం పాతకాలపు ప్రతిదీ తిరస్కరణకు గురైన దశ. నన్నయ్యను బొందె లోనే నిద్ర పోనివ్వు వంటి నిఖిలేశ్వర్‌ వాక్యాలు దానికి ఉదాహరణలు. 1975లో వచ్చిన అత్యవసర పరిస్థితి ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మొపింది. అనుభూతివాదం వంటివి మొదలైనాయి. సాహిత్యరంగం లోనూ చర్చలోనూ కొంత ఖాళీ ఏర్పడింది. అలాంటి సమయంలో కెకెఆర్‌ చొరవ కొత్త గవాక్షాలు తెరిచింది. సాహిత్యంలో విభిన్న ధోరణులు అంటూ వరుసగా మాట్లాడించి పుస్తక రూపంలో ప్రచురించి అర్థవంతమైన ముందు మాట రాసి ఆయన భిన్న కోణాలను ఆవిష్కరింపచేశారు.
   భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి శిష్యుడైన కెకెఆర్‌ భాషా పరిశోధన లోనే డాక్టరేట్‌ పుచ్చుకున్నారు. సాహిత్యం భాషా రెంటినీ అధ్యయనం చేస్తేనే సమగ్రమైన అవగాహనకు రాగలమని ఆయన గుర్తించారు. రూపం, నిర్మాణం బట్టి సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని అధ్యయనం చేయడంలో అలంకార సిద్ధాంతాలను ఆధునిక దృక్పథాలను ఎలా అర్థంచేసుకోవచ్చునో అరిస్టాటిల్‌, ఆనందవర్ధనుడు మొదలు త్రిపురనేని మధుసూదనరావు వరకూ తీసుకుంటూ సోదాహరణంగా చెబుతారు.
   నూరు సంవత్సరాల తెలుగు దశ దిశ, తెలుగు ఆధునికత ప్రాచీనత అనే వ్యాసాలు భాషావేత్తగానూ సామాజిక చారిత్రిక అధ్యయనశీలిగానూ గొప్ప అవగాహన నిస్తాయి. తెలంగాణ ఉద్యమం, కేంద్రం తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలనే ఆందోళన వచ్చినపుడు పైకి ఏది చెప్పకుండానే అన్ని అంశాలనూ స్పృశిస్తూ ఆయన ఈ వ్యాసాలు రాశారు. తెలుగు ప్రామాణిక రూపం తీసుకోవడానికి ఒక కారణం ఆధునిక కాలం అంటూ ప్రారంభమయ్యే నాటికి తెలుగువారికి తమదంటూ ఒక నగరం లేకపోవడం అని గురజాడను కూడా ఉటంకిస్తూ చెబుతారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం సంగతి అటుంచి హైదరాబాదులో కూడా పాలనా భాషలుగా పర్షియన్‌ ఉర్దూ చలామణి అయ్యాయి. 1910 తర్వాతనే సాధారణ వ్యవహార రూపానికి దగ్గరగా వుండే ఆధునిక తెలుగు భాషా శైలి రూపుదిద్దుకోవడం మొదలైందని నిర్ధారించారు. 1925-30 నాటికి ఆధునిక తెలుగు వచన శైలి వ్యాపించిందని వివరించారు. మనుష్యేతర వాచకాలలో ము ప్రత్యయం పోయి మ్‌(ం) మాత్రమే మిగిలింది. నేనున్నూ అనేబదులు నేనూ అని రాయడం వచ్చింది. మార్పుల తర్వాత కూడా 1960ల వరకూ సరళ గ్రాంథికం కొనసాగింది. మొత్తంపైన ఇందుకోసం వందల ఏళ్లకాలం వాదనలు, ఉద్యమాలూ అవసరమైనాయి. చాలా సున్నితమైన ఈ చర్చలో ఎలాంటి ప్రాంతీయ లేదా పాక్షిక భావనలు లేకుండా శాస్త్రీయంగానూ ఆమోదకరంగానూ చెప్పడం కెకెఆర్‌ ప్రత్యేకత. భాషా శాస్త్ర దృష్టిలో ఒక భాషా వ్యవహారం ఎక్కువదని గాని మరొకటి తక్కువదని కానీ వుండదని అటువంటి భావాలు ఎక్కడైనా ఎవరికైనా ఏర్పడితే అవి సామాజికమైనవి వ్యక్తిగతమైనవి తప్ప భాషాగతమైనవి కాదని స్పష్టం చేస్తారాయన. సామాజిక భాషా శాస్త్ర పరిశోధనలను విద్యావంతులకు విస్తారంగా అందుబాటు లోకి తెస్తే పొరబాటు అభిప్రాయాలు కొంతైనా తొలగిపోతాయని సూచిస్తారు. మానవ సమాజ వికాస క్రమంలో నిర్వహించే పాత్రను బట్టి భాషల ప్రాధాన్యత ఏర్పడుతుందంటారు. ఆధునిక జీవితంలోని క్లిష్టతను, వేగాన్ని ప్రతిబింబించే తెలుగు రచనలు వచ్చి వాటిని ఇతర ప్రపంచ భాషల్లోకి అనువదించడం జరిగితేనే ఆధునికత సమస్యలు పరిష్కారం అవుతందని స్పష్టం చేస్తారు. వాస్తవానికి ఈ రచయిత సంపాదకత్వంలో వచ్చిన 'ప్రస్థానం' ప్రత్యేక సంచికలో తెలుగు జాతి, సంస్కృతి ఎలా చారిత్రికంగా రూపొందాయో అత్యంత ప్రామాణికంగా సుదీర్ఘంగా రాశారాయన.
   గురజాడ, శ్రీశ్రీల నుంచి ఇటీవలి రచయితల దాకా చాలామందిని సందర్భోచితంగా సమీక్షించిన, విశ్లేషించిన కెకెఆర్‌ విలువైన పాఠాలు తీశారు. కొత్తవారి పుస్తకాలకు రాసిన ముందుమాటల్లో సూత్రీకరణలతో పాటే ఆయా రచయితల ప్రత్యేకత ఏమిటో చెబుతారు. కాలీనత అంటే కాలానుగుణమైన పరిణామక్రమం అది రచనలో ప్రతిబింబించే తీరు ఇది కెకెఆర్‌ ప్రధానంగా గమనించే అంశం. స్థల కాలాలలోనే రచనలు సాధ్యం గనక సామయిక, స్థల సాహిత్యం నిశితంగా పరిశిలించారు. శ్రీశ్రీని గురించి చాలా రాసినా గురజాడలో ఆధునికత ఎక్కువన్నది ఆయన మాట. శ్రీశ్రీ కవిత్వాన్ని గొప్పగా చెబుతూనే ఆయన భావుకత పరిమితులు కూడా గమనంలో పెట్టుకోవాలంటారు. అయితే శ్రీశ్రీ కవిత్రయంగా చెప్పిన ముగ్గురు తిక్కన వేమన గురజాడల గొప్పతనం ఏమిటో ప్రత్యేకంగా రాశారు. త్రిపురనేని, కెవిఆర్‌ వంటి విమర్శకుల నుంచి బాలగోపాల్‌, అశోక్‌ కుమార్‌ వంటి వారి వరకూ కూడా ఆయన పరిశీలన లోకి వచ్చారు. మౌఖిక విమర్శనా శైలి అని దానికి పేరు పెట్టారు. సమాజ కవులు అని తాను నామకరణం చేసిన భక్తికవులపై పిల్లలమర్రి రాములు రాసిన పుస్తకానికి ముందుమాట రాస్తూ దాన్ని సమాంతర సాహిత్యం అని అభివర్ణించారు. 'క్రైస్తవ సంకీర్తనలు' అన్న పుస్తకానికి ముందుమాట రాస్తూ భారతీయ సంప్రదాయ భక్తి సాహిత్యంలో దేవుడి గురించిన వర్ణనలకు, వాటికి తేడా ఏమిటో చెప్పారు! ఇన్ని గంభీరమైన విషయాలు చర్చిస్తూనే కలం పేర్లు, మారు పేర్లు అన్న రచనలో మనుషుల అసలు పేర్లకు చలామణి లోకి వచ్చే పేర్లకు పొట్టి అక్షరాలకూ తేడాలు, పోలికలు ఎన్ని రకాలో బోలెడు ఉదాహరణలతో చెప్పారు.
   అపారమైన అధ్యయనం, సమగ్రత, స్పష్టత వున్నా వినమ్రంగా ఆచితూచి జీవించిన కె.కె రంగనాథాచార్యుల కృషి గురించి ఎంతైనా చెప్పవచ్చు గాని పరిమితంగా రాయడం మితంగా మాట్లాడ్డం ఆయన లక్షణాలు. సారస్వత కళాశాల ప్రిన్సిపాల్‌గా తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన మార్గదర్శిగా ఎందరినో తీర్చిదిద్దారు. ప్రగతిశీల ఉద్యమాలతో కలసి నడిచారు. తను సేకరించి పెట్టుకున్న అమూల్య గ్రంథాలను సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి విరాళంగా ఇచ్చి సుసంపన్నం చేశారు. వర్ణాంతర వివాహం చేసుకుని సంస్కరణ స్ఫూర్తి చాటారు. సాహితీ స్రవంతి నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలు సదస్సులలో కీలక ప్రసంగాలు చేసి ప్రోత్సహించారు. ప్రజాశక్తి బుకహేౌస్‌లో హరిపురుషోత్తమరావు ఆయనకు సన్నిహితులు గనక చాలాసార్లు చర్చోపచర్చలు సాగుతుండేవి. ఈ కరోనా కాలంలో అనుకోని విధంగా ఆయన మరణవార్త దిగ్భ్రాంతికరం. ఆయన రచనలు, బోధనలే మిగిలిన స్ఫూర్తి.