Jul 30,2021 12:05

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ కు భారీగా వరద నీరు చేరుతుంది. సాగర్‌ ప్రస్తుత ఇన్‌ ఫ్లో 3,57,667 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 544.8 అగుడులుగా కొనసాగుతుంది. ఇదే ఇన్‌ ఫ్లో కొనసాగితే రెండు, మూడు రోజుల్లో సాగర్‌ గేట్లు తెరచుకోనున్నాయి. గత కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలతో తెలుగు నేలపై ప్రాజెక్టుల వద్ద వరద నీరు పరవళ్ళు తొక్కుతుంది. ఎగువన ఉన్న శ్రీశైలం డ్యాం గేట్లు పూర్తిగా ఎత్తేసారు. ఈ డ్యాం ప్రస్తుత ఇన్‌ ఫ్లో 4,90,715 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 4,50,071 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. నీటిమట్టం 885 అడుగులుగా ఉన్న శ్రీశైలం డ్యాం ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. అంతేకాకుండా 45 గేట్లు ఎత్తేసిన జూరాల ప్రాజెక్ట్‌ ఇన్‌ ఫ్లో 4.26 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 4.31 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. 1633అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు ప్రస్తుతం 1632.6 అడుగులుగా కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్‌ ఇన్‌ ఫ్లో 82,150 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 31,600 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. శ్రీశైలం డ్యాం, జూరాల ప్రాజెక్ట్‌, తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువ ఉన్న నాగార్జున సాగర్‌ కు భారీగా వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడడంతో శ్రీశైలం డ్యామ్‌ చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు.