Aug 01,2021 21:54

* కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తం
ప్రజాశక్తిా యంత్రాంగం, అమరావతి బ్యూరో :
నాగార్జున సాగర్‌కు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 5,18,724 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండడంతో ఆదివారం సాయంత్రం 14 క్రస్టు గేట్లను ఎత్తి నాగార్జున సాగర్‌ నుంచి దిగువకు లక్షా ఐదు వేల క్యూసెక్కుల నీటిని సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ధర్నానాయక్‌ విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ఆదివారం రాత్రి ఏడు గంటలకు 583.90 అడుగులకు చేరింది. సాగర్‌ నుంచి సోమవారం ఉదయం మరో ఐదు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నందున కృష్ణా పరివాహక ప్రాంతంలోని 14 మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ కోరారు. రాత్రి ఎనిమిది 8.30 గంటలకు పులిచింతల డ్యాం ఎనిమిది గేట్లు ఎత్తి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గత రెండేళ్లుగా ఆగస్టు రెండో వారంలో కృష్ణ తీరానికి వరద రాగా, ఈ ఏడాది మొదటి వారంలోనే వరద వచ్చిందని అధికారులు తెలిపారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌, ఎంపి లింగయ్య ఆదివారం మధ్యాహ్నం నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ సోమవారం ఈ ప్రాజెక్టును సందర్శించనున్నారు. శ్రీశైలానికి వరద నీరు పోటెత్తడంతో పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,67,280 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల డ్యాం గేట్ల నుంచి 4,65,061 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 35,586 క్యూసెక్కుల నీటితో కలిపి మొత్తం 5,00,647 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. విద్యుదుత్పత్తి అనంతరం ఎపి విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 30,092 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 20,130 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయ గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 883.40 అడుగులకు చేరుకుంది. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129.72 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 87.48 టిఎంసిలు ఉన్నాయి. ఇన్‌ఫ్లో 3,87,207 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 4,02,909 క్యూసెక్కులు ఉంది. నారాయణపూర్‌ పూర్తి సామర్థ్యం 37.65 టిఎంసిలు కాగా, ప్రస్తుత 26.42 టిఎంసిలు ఉన్నాయి. ఇన్‌ఫ్లో 4,10,214 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 4,00,374 ఉంది. తుంగభద్ర పూర్తి సామర్థ్యం 100.8 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 97.2 టిఎంసిలు ఉన్నాయి. ఇన్‌ఫ్లో 36,215 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 51,354 క్యూసెక్కులు ఉది.

శ్రీశైలం ఘాట్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌
శ్రీశైలం ఆనకట్ట గేట్లు ఎత్తడంతో సందర్శకుల వాహనాలు, మరోవైపు శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకునేందుకు వచ్చిన వాహనాలతో ప్రాజెక్టు పరిసర ప్రాంతంలోని ఘాట్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలతోపాటు స్థానికులు తరలివస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో, వాహనాలను అక్కడే వదిలిపెట్టి కాలినడకన వచ్చి ప్రాజెక్టును సందర్శించారు.