Nov 17,2023 23:03


ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: నిన్నటి వరకు అక్కడ అంతా వ్యర్థాలతో దుర్వాసన.. పేరుకుపోయిన చెత్త కుప్పలు దర్శనమిచ్చేవి. పారిశుద్ధ్యంపై కమిషనర్‌ అరుణ తీసుకున్న చొరవతో ప్రస్తుతం అక్కడ ప్రదేశమంతా పరిశుభ్రంగా దర్శనమిస్తోంది. పచ్చని మొక్కలు కలకలలాడుతున్నాయి. నగరంలోని 34వ వార్డులో ఆర్టీసీ డిపో రోడ్డులో వ్యర్ధాలతో నిండిన ప్రాంతాన్ని నగరపాలక ప్రజారోగ్య విభాగం అధికారులు శుభ్రం చేయించారు. శుభ్రం చేసిన ప్రాంతంలో శుక్రవారం నగర కమిషనర్‌ డాక్టర్‌ అరుణ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలో వీధుల్లో, నివాసాల మధ్య ఇష్టారాజ్యంగా వ్యర్ధాలు పడేయరాదని, వ్యర్ధాలను తడి, పొడిగా వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందివ్వాలన్నారు. నగరపాలక పరిధిలోని అన్ని వార్డుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. స్థానిక ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. నివాసాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటిన ప్రాంతంలో వ్యర్ధాలు పడేయరాదని బోర్డులను ఏర్పాటు చేయాలని, రోజూ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ చిన్నయ్య, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.