ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : నగరంలో ప్రేమ దేశపు యువరాణి చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా బందర్ రోడ్డు లోని ఒక హౌటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో యమిన్‌రాజ్ మాట్లాడుతూ ఒక అందమైన ప్రేమ కథను ప్రేక్షకులకు సరికొత్తగా ఈ చిత్రం ద్వారా చూపించనున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. తాను విజయవాడలో పుట్టి పెరిగానని సినిమాలంటే ఎంతో ఇష్టమని, యాక్టింగ్ నేర్చుకుని ప్రేమదేశపు యువరాణి చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నానని చెప్పారు. విజయవాడ నుంచి తమ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. విజయవాడ ప్రేక్షకులకు సినిమా నచ్చితే ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని భావన అందరిలో ఉందని పేర్కొన్నారు. దర్శకుడు సాయి ప్రతి సన్నివేశాన్ని ఎంతో చక్కగా తీశారని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక ఆదరించాలని ఆయన కోరారు. తదనంతరం హీరోయిన్ ప్రియాంక రెవిరీ మాట్లాడుతూ తాను నటించినా తొలి చిత్రం ప్రేమజేషకు ప్రేమదేశపు యువరాణి చిత్రంలో ఒక అందమైన యువతి పాత్రలో నటించానని తన పాత్ర అందరికీ నచ్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకులు చిన్న చిత్రాలను తప్పక ఆదరించాలని ఆమె కోరారు. అనంతరం దర్శకుడు నిమ్మల సాయిసునీల్ మాట్లాడుతూ గ్రామీణ వాతావరణంలో ఈ చిత్రాన్ని తీశానని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేశామని, పాటలకు విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షతోనే పనిచేశారని తెలిపారు. విలేకరుల సమావేశంలో నటులు రాజా రెడ్డి,పవన్ పాల్గొన్నారు.










