ప్రజాశక్తి - పిఎం.పాలెం : వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యుజి - 2022 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విశాఖ జిల్లా వ్యాప్తంగా 7792 మంది దరఖాస్తు చేసుకోగా 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి విద్యార్థులకు పలుచోట్ల అన్ని సౌకర్యాలనూ సమకూర్చారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షకు నిమిషం నిబంధన ఉండటంతో ఉదయం పది గంటలకే ఆయా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. వారిని మెటల్ డిటెక్టర్లతో సిబ్బంది నిశితంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి విడిచిపెట్టారు. చెవుల దిద్దులు, కాళ్ల పట్టీలు, షూ వంటి వాటిని బయట తీసేసిన తరువాతే అనుమతించారు. అన్ని చోట్లా వీడియా రికార్డింగ్ ఏర్పాట్లు చేశారు. పిఎం.పాలెంలోని బాబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో, సాంకేతిక కళాశాలలో, వుడా కాలనీ సమీపంలో ఉన్న విజయం స్కూల్‌లో ఈ పరీక్షకు మంచి ఏర్పాట్లు చేశారని విద్యార్థులు తెలిపారు. అన్నిచోట్లా కోవిడ్ నిబంధనలు అమలు జరిపారు.










