Sep 21,2022 00:04

సుజాతనగర్‌లో హత్యకు గురైన సందీప్‌

ప్రజాశక్తి-యంత్రాంగం
విశాఖ నగర పరిధిలో ఇటీవల హత్యలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక చోట తరచూ హత్య జరిగిన వార్తలు వెలుగుచూస్తున్నాయి. దీంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పెంటయ్యనగర్‌లో హత్య
గాజువాక : గాజువాక పెంటయ్యనగర్‌లో మంగళవారం తెల్లవారుజామున హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బి.వెంకటరమణ(26), ఏసురాజు (25) గాజువాక చికెన్‌ షాప్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరూ పెంటయ్యనగరో ఒక గదిలో నివాసముంటున్నారు. సోమవారం రాత్రి ఇద్దరూ తాగిన మైకంలో ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించు కున్నారు. ఉదయం లేచిన తర్వాత కూడా రాత్రి జరిగిన విషయంపై మరలా గొడవపడ్డారు. ముందుగా వెంకటరమణ బకెట్‌తో ఏసురాజు తలపై కొట్టాడు. ఏసురాజు గదిలో ఉన్న ఇనుక రాడ్డు తీసుకొని వెంకటరమణ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెంటనే ఏసురాజు గాజువాక పోలీసులకు లొంగిపోయాడు. గాజువాక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హత్యా, ఆత్మహత్యా?
పెందుర్తి: స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పులగాలిపాలెం రోడ్డునందు గల టింబర్‌ డిపో వద్ద మామిడి తోటలో గంట గణేష్‌ (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రేమలో విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తుండగా, తమ కుమారుడిని అమ్మాయి కుటుంబీకులే హత మార్చారని గణేష్‌ తండ్రి ఆరోపిస్తున్నారు. దినసరి కూలిగా పనిచేస్తున్న గణేష్‌ ఈనెల 15 నుంచి కనిపించడం లేదంటూ అతని తండ్రి సింహాచలం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మామిడి తోట దగ్గర దుర్వాసన రావడంతో స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి గంట గణేష్‌గా గుర్తించారు. గణేష్‌ మృతిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
సుజాతనగర్‌లో యువకుడు హత్య
పెందుర్తి: పులగాలిపాలెం రోడ్డులో గంట గణేష్‌ అనుమానాస్పద మతి ఘటన వెలుగు చూసి 24 గంటలు గడవకముందే సుజాతనగర్‌ 80 అడ్డుగుల రోడ్డు చివర విరాట్‌నగర్‌ కాలనీ వద్ద చింత సందీప్‌ (30) దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నలుగురు యువకులు సందీప్‌ను పట్టుకొని కత్తితో పొడిచారని తెలిపారు. దర్యాప్తు చేపట్టారు. నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.