
ప్రజాశక్తి- విజయనగరం టౌన్ : నగర సుందరీకరణకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం రాత్రి నగరంలోని మయూరి జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కాఫీ కప్ విత్ వాటర్ ఆకృతిని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సుందరంగా తీర్చిదిద్దిన ఆచంట గార్డెన్‌ను ప్రారంభించారు. ఆచంట గార్డెన్‌లో ఏర్పాటు చేసిన వ్యాయామశాలను, బుద్ధుని విగ్రహాన్ని, విజయనగరం విద్యుత్ నామఫలకాలను ఆవిష్కరించారు. విద్యుత్ దీపాలను ప్రారంభించారు. దీంతో అంబేద్కర్ జంక్షన్ నుంచి మయూరి జంక్షన్ వరకు విద్యుత్ దీపాలతో కాంతిలీనమైంది. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన తర్వాత అవసరమైన అన్ని హంగులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రధాన జంక్షన్‌లను అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆకృతులను ప్రారంభించడంతో నగరం అంతా విద్యుత్ కాంతులతోనూ వివిధ రకాల ఆకతులతో ఆకర్షణీయంగా దర్శనమిస్తోందన్నారు. అచంట గార్డెన్ తమ చిన్నప్పటి నుంచి నిరాదరణకు గురైందని ప్రస్తుతం మంచి రూపురేఖలతో అందంగా తీర్చిదిద్దబడిందని ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, ఎమ్మెల్సీ సురేష్ బాబు, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, లయ యాదవ్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్ శ్రీ రాముల నాయుడు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.