Nov 10,2023 23:54

పార్కులో ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్రం వద్ద నివాళులర్పిస్తున్న రామకృష్ణారెడ్డి తదితరులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాష్ట్రంలోని నగరాలన్నింటిలో ఆహ్లాదకరమైన పార్క్‌లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు. మార్కెట్‌ సెంటర్లోని గాంధీ పార్కును రూ.6.25 కోట్లతో అభివృద్ధి చేయగా దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం పున:ప్రారంభించి మాట్లాడారు. మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం నుండి పచ్చదనం ప్రశాంతతని అందించడంలో పార్క్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయని, గాంధీ పార్క్‌ అభివృద్ధి ద్వారా గుంటూరు నగర ప్రజలకు ఆహ్లాదం అందేలా నగరపాలక సంస్థ చర్యలు తీసుకుందని అన్నారు. గాంధీ పార్క్‌ పిల్లలను ఆకర్షించేలా స్ప్లాష్‌ ప్యాడ్‌, జంగిల్‌ బుక్‌, వెస్ట్‌ టు వండర్‌, గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ టారు ట్రైన్‌, చెస్‌ బోర్డ్‌, జీబ్రాలు, జిరాఫిల నమూన ప్రదర్శనశాల, బటర్‌ ఫ్లై జోన్‌లు, అందర్నీ అలరించేలా సెల్ఫి పాయింట్స్‌, సీటింగ్‌ ప్లాజాలు, పార్టీలాన్‌, ఓపెన్‌ జిమ్‌లతో నగరానికి నూతన శోభను తెస్తుందని చెప్పారు. మారుతున్న కాలానికి తగిన విధంగా పిల్లలకు ఎడ్యుకేటివ్‌గా పార్క్‌ను తీర్చిదిద్దారన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో వాకింగ్‌ ట్రాక్‌లు, పార్క్‌లు అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ రక్షణ, నగర వాతావరణంలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు చెప్పారు. మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు ఆధ్వర్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధిలో గుంటూరు నగరం ముందు పీఠిన ఉంటుందన్నారు. అన్ని వయస్సుల వారు ఆనందించేలా తీర్చిదిద్దిన గాంధీ పార్క్‌ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపి అయోధ్యరామిరెడ్డి, ప్రభుత్వ విప్‌ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్‌ మనోహర్‌ నాయుడు, కమిషనర్‌ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముస్తఫా, మద్దాలి గిరిధర్‌, డిప్యూటీ మేయర్లు వి.బాలవజ్రబాబు, షేక్‌ సజిలా, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ పురుషోత్తం, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముంతాజ్‌ పఠాన్‌, జిడిసిసి బ్యాంక్‌ చైర్మన్‌ రామాంజనేయులు, జిఎంసి ఎస్‌ఇ భాస్కర్‌, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్‌.శ్రీనివాస్‌, వెంకటకృష్ణయ్య, ఎంహెచ్‌ఒ భానుప్రకాష్‌ పాల్గొన్నారు.