Aug 06,2023 23:27

స్థానికులతో మాట్లాడుతున్న మేయర్‌

ప్రజాశకి-గుంటూరు : నగరాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక 12వ డివిజన్‌లో చందనబ్రదర్‌ నుండి కోడి గుడ్డు సత్రం వరకు రోడ్డుకు ఇరువైపులు డ్రెయిన్‌ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి, ఆక్రమణలపై, స్థానిక పెద్దలు, అధికారులతో కలిసి చర్చించారు. అనంతరం మేయర్‌ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయని, ఆ బాధలను తొలగించటానికి చందన బ్రదర్స్‌ నుండి కోడిగుడ్డు సత్రం వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా రూ.1.30 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులతో డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆ రోడ్లు ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటుందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని రోడ్డుపై ఉన్న ఆక్రమణలు తొలగించి వ్యాపారులకు, స్థానికంగా ఉండే ప్రజలకు ఇబ్బందులు లేకుండా డ్రెయిన్లు నిర్మిస్తామని తెలిపారు. నిర్మాణ సమయంలో స్థానిక ప్రజల సహాయ సహకారాలు ఎంతో ముఖ్యమని, నగరాభివృద్ధి కోసం ప్రజలూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ ఖాజా మొహిద్దీన్‌చిష్టి, ఈఈ కోటేశ్వరరావు, ఎసిపి అజరు కుమార్‌, అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
బిడ్డలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమని నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని నగరంలోని 20వ డివిజన్‌లో నల్లచెరువులో, అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గర్భిణులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ తల్లిపాలతో పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కరోనా సమయంలో కూడా పెద్ద వారికే ఎక్కువగా కరోనా వచ్చిందని, పిల్లలు ఎవరూ కరోనా బారిన పడలేదని చెప్పారు. దానికి ప్రధాన కారణం వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. గర్భిణులు 3వ నెల నుండి, బిడ్డపుట్టి 6 నెలలు వచ్చే వరకు తల్లీబిడ్డలకు వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ టేక్‌ హోం రేషన్‌ కిట్లను అందజేస్తుందని వివరించారు. కార్యక్రమంలో వైసిపి 19, 20 డివిజన్ల అధ్యక్షులు టెంట్‌ హౌస్‌ బాబు, కంతేటి శ్యాం శేఖర్‌, కవిత, ఫాతిమా, రియాజ్‌, అంగన్‌ వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.