Oct 12,2023 23:54

బిల్డర్లతో సమావేశంలో నగర కమిషనర్‌

గుంటూరు: గుంటూరు నగరాభివృద్ధికి బిల్డర్లు ముందుకు రావాలని, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం కమిషనర్‌ చాంబర్‌లో బిల్డర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, అధికారులతో కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ తొలుత బిల్డర్లను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నగరాభివృద్ధికి ప్రభుత్వ నిర్దేశిత పన్నులు సకాలంలో చెల్లించాలన్నారు. భవన నిర్మాణ ప్లాన్‌ కోసం దరఖాస్తు చేసే సమయంలోనే నిబంధనల మేరకు పన్నులు చెల్లించడం, ప్లాన్‌ ప్రకారం నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ దరఖాస్తుకి ముందే రెవెన్యూ విభాగం నుండి సదరు భవనానికి సంబంధించి ఖాళీ స్థల పన్ను, ఇతర పన్నులపై ఎన్‌ఓసి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆక్యుపెన్సీ, మార్ట్‌గేజి విడుదల జాప్యం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. భవనాలకు పోస్ట్‌ వెరిఫికేషన్‌ కూడా వేగంగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని సిటీ ప్లానర్‌ని ఆదేశించారు. ఐపిఎల్పి పెండింగ్‌ ఫైల్స్‌ని 10 రోజుల్లో డిస్పోజ్‌ చేయాలని, ఓసిలు, డిపిఎంఎస్‌లకు చెక్‌ లిస్ట్‌లను బిల్డర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమన్వయం చేసుకొని తయారు చేయాలని సిటీ ప్లానర్‌కి తెలిపారు.సమావేశంలో అదనపు సిటీ ప్లానర్‌ ప్రదీప్‌కుమార్‌, డిప్యూటీ సిటీ ప్లానర్‌ మహాపాత్రో, నరేడ్కో క్యాపిటల్‌ జోన్‌ ప్రతినిధులు వి.శ్రీనాద్‌, సీతారామయ్య, సురేష్‌, దుర్గా ప్రసాద్‌, మధుసూదన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.