ఎకో టూరిజానికి ప్రాధాన్యం - జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ప్రజాశక్తి - ఏలూరు
జిల్లాలో టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయని, అందుకే పట్టణ ప్రాంతాల్లో నగర వనం కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. ఇందులో భాగంగా ఏలూరు సమీపంలోని సత్రంపాడులో గుర్తించిన భూమితోపాటు ప్రత్యమ్నాయంగా మరో ప్రాంతంలో అనువైన భూమిని కూడా గుర్తించి పర్యాటకంగా నగర వనం ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా అటవీశాఖ అధికారిని ఆదేశించారు. కొల్లేరును పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొల్లేరు పరిధిలోని మాధవరం, ఆటపాక, జాలిపూడి, కలకుర్రు, గుడివాకలంక గ్రామాల్లో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా అటవీ అధికారులను ఆదేశించారు.
కొరుటూరు, జల్లేరు, ముంజులూరు జలాశయ ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. గుంటుపల్లి ప్రాంతంలో పర్యాటకంగా బుద్ధిజం ప్రాంతాన్ని అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకు అటవీ, పర్యాటక శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. ద్వారకాతిరుమలలోని చెరువులో బోటింగ్ పాయింట్, చిన్నారుల పార్కు ఏర్పాటు చేయాలని.. ఇందుకు దేవస్థానం అథారిటీలోని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, ఇందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కొండ పోరంబోకు తదితర ప్రాంతాలతోపాటు, జాతీయ రహదారుల వెంబడి పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు చురుకైనపాత్ర వహించాలన్నారు. మొక్కలు నాటేందుకు అనువైన భూమిని గుర్తిస్తే అందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి (టెరిటోరియల్) రవీంధ్రధర్మ, సెట్ వెల్ సిఇఒ, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎమ్‌డిహెచ్ మెహర్రాజ్, సామాజిక వన విభాగం డిఎఫ్‌ఒ హిమశైలజ, పర్యాటక అభివృద్ధి సంస్థ ఇఇ రాజారావు, డిప్యూటీ ఇఇ సత్యనారాయణ, డివిజనల్ మేనేజరు శ్రీనివాసరావు, జలవనరుల శాఖ డిప్యూటీ ఎస్‌ఇ రమేష్ బాబు, ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ కె.తిమ్మరాజు, ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఎఇ బాస్కర్, ఎఫ్‌ఆర్‌ఒ (అటవీశాఖ) ఎస్‌కె.ఫిరోజ్, సహాయ పర్యాటక శాఖ అధికారి పట్టాభిరామన్ పాల్గొన్నారు.










