Jul 21,2022 23:04

66వ వార్డు పర్యటనలో కమిషనర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ

ప్రజాశక్తి- గాజువాక : నగర స్వచ్ఛతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు. గురువారం 66వ వార్డు కార్పొరేటర్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ విజ్ఞప్తి మేరకు గాజువాక జోన్‌ పరిధిలోని కణితి, అజీమాబాద్‌, కైలాసనగర్‌, బిసి రోడ్డు, ఇందిరా నగర్‌ కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను కమిషనర్‌కు కార్పొరేటర్‌ ఇమ్రాన్‌ వివరించారు.స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగర స్వచ్ఛతలో రాజీ లేకుండా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని, పారిశుధ్య కార్మికులు ఇంటింటి చెత్త సేకరణ చేయాలని, రోడ్డ్లు, కాలువలు శుభ్రం చేయాలని చెత్త పోగులను ఎప్పటికప్పుడు తొలగించి డంపింగ్‌ యార్డుకు తరలించాలని ఆదేశించారు. వార్డులో ప్రజలు తడిపొడి చెత్తను వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందించేలా చూడాలని సూచించారు. వార్డులో ప్లాస్టిక్‌ నిర్మూలన పూర్తి స్థాయిలో జరగడం లేదని, దుకాణాలను, టిఫిన్‌ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్‌ కలిగి వుండే వారి నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ నిర్మూలనకు నగర పౌరులు, వ్యాపారులు, విద్యార్ధులు ముందుకు వచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గాజువాక జోనల్‌ కమిషనర్‌ పొందూరు సింహాచలం, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కెఎస్‌ఎల్‌జి. శాస్త్రి, జోనల్‌ కమిషనర్‌ పి సింహాచలం, ఇతర అధికారులు పాల్గొన్నారు.