Oct 04,2023 19:43

పనులను పరిశీలిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర అందాలను మరింత ఇనుమడింప చేసే విధంగా కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ మేరకు బుధవారం మయూరి జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పోలీస్‌, ఆర్‌అండ్‌బి, కార్పొరేషన్‌ అధికారులతో ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. ట్యాంకుబండ్‌ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఫౌంటెన్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రహదారి విస్తరణ, ట్రాఫిక్‌ ఐలాండ్‌ అభివృద్ధి చర్యలపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ఆర్‌.శ్రీరాములునాయుడు మాట్లాడుతూ మయూరి జంక్షన్‌ నుండి అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు రహదారి అభివృద్ధి పనులు పైడితల్లమ్మ జాతర సమయానికల్లా పూర్తి చేస్తామన్నారు. జంక్షన్లు మరింత అందంగా, ఆకర్షణీయంగా దర్శనమిచ్చేలా రూపుదిద్దుకోనున్నట్లు చెప్పారు. ఆర్‌అండ్‌బి డిఇ శ్రీనివాసరావు మాట్లాడుతూ 3.40 కోట్ల రూపాయలతో మయూరి జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టామన్నారు. డివైడర్‌ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయిన వెంటనే బిటి రహదారి వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ డిఎస్‌పి డి.విశ్వనాథ్‌, వైసిపి నాయకులు రవిచంద్ర, యడ్ల రాజేష్‌, కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.