బాధ్యతలు బరువుకు వంగుతున్న శరీరాలు
బిగబట్టిన ధైర్యపు పిడికిళ్లను సడలిస్తున్నాయి
ఒంట్లోని నరాలన్నీ తెగిపోయిన
కరెంటుతీగలలా నిర్జీవంగా వేలాడుతున్నాయి
బతుకు పందెంలో ఓడిపోతున్న దేహాలు
అలసిపోయి గెలుపు మరచి నిద్రపోతూ
సమస్యల చిక్కుముళ్ల మధ్య చిక్కిన
చేపపిల్లలా విలవిల్లాడుతున్నాయి దీనంగా
కలల సంకెళ్లు తెంచుకోలేకపోతున్న కళ్లు
కనురెప్పల ఎదుటి నిజాలను చూడలేక
భయంతో చీకటి కోనేరులా కన్నీటి
బిందువులను జారవిడుస్తున్నాయి నిరాశగా
ఒంటరితనంలోకి కూరుకుపోతున్న గుండెలు
ఎలుగెత్తిన గొంతులను చిదిమేస్తున్నాయి
గొంతులో గూడుకట్టుకున్న స్వరాలన్నిటినీ
ఒకేసారి సమాధి చేస్తున్నాయి మౌనంగా
అత్యాశల ఆవిరికి ఉడికిపోతున్న మెదళ్లు
విలువల వలువలను వదిలేస్తూ ఒక్కొక్కటిగా
సిగ్గులేకుండా నగ దేహాలతో ఊరేగుతున్నాయి
దేవతావస్త్రాలు ఒంటిపైనున్నాయని
సరిపెట్టుకుంటూ
ఈదర శ్రీనివాసరెడ్డి
78931 11985