
రేషన్ డిపోలలో ఇచ్చే బియ్యం ఎక్కువమంది తినడం లేదని, బయట అమ్ముకుంటున్నారని, ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారని దీనిని అరికట్టడం కోసమే నగదు బదిలీ అని పాలకులు ప్రచారం చేస్తున్నారు. కొందరు సజ్జలు, రాగులు తింటున్నారని, అందుకే బియ్యం ఆపేస్తున్నామని కుంటిసాకులు చెప్తున్నారు. ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టిన చందంగా ఉంది ప్రభుత్వ తీరు. జగన్ మాట ఇచ్చినట్టుగా నాణ్యమైన, సన్న బియ్యం ఇస్తే అందరూ తింటారు. బియ్యం తిననివారికి సజ్జలు, రాగులు అందించవచ్చు. గతంలో ఇచ్చారు కూడా. ఇప్పుడు మొత్తం బియ్యం సరఫరా రద్దు చేయడం ఎందుకు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దీని వెనుక రహస్య ఎజెండా ఉంది. ప్రజల మేలు కోసమే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
బియ్యం కావాలా? డబ్బు కావాలా? అని రాష్ట్రం లోని ఐదు పట్టణాలలో (గాజువాక, అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, నంద్యాల) వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా సర్వే ఆపివేసింది. రోజుకో మాట చెబుతోంది. అంతిమంగా నగదు బదిలీ విధానాన్ని అమలు చేస్తారు. డబ్బు కావాలని కోరుకునే వారికి బియ్యం ఆపేస్తారు. డబ్బులు ఎంత ఇస్తారో ప్రకటించలేదు. కిలోకు రూ.12 లేదా రూ.15 ఇవ్వవచ్చని ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా ఐదు పట్టణాల్లో ఈ స్కీం ప్రారంభించినా, తరువాత క్రమంగా రాష్ట్రమంతా విస్తరిస్తుంది. రాష్ట్రంలో రేషన్ డిపోలు మూతపడతాయి. రేషన్ వాహనాలతోనూ పని ఉండదు. ఇష్టమైన వారు మాత్రమే డబ్బు తీసుకోవచ్చని సర్కార్ చెపుతున్నా, నగదు బదిలీ ప్రవేశపెట్టాలనే ఆలోచన ప్రభుత్వానిది కాబట్టి... ఒప్పించి, భ్రమపెట్టి, బెదిరించి క్రమంగా రాష్ట్రమంతా రేషన్ స్థానంలో నగదు వచ్చేస్తుంది. మూడు నెలల తర్వాత నగదు వద్దంటే బియ్యం ఇస్తామని ఇప్పుడు చెప్పినా, అది అమలుకు నోచుకోదు. బియ్యం కాకుండా ఇతర సరుకులు ఇస్తామని చెప్పినా, ఇప్పటికే ఇచ్చే సరుకులు దాదాపు లేవు. కందిపప్పు కిలో రూ.40 నుంచి రూ.67కు రేటు పెంచారు. పంచదార ఇచ్చేది అర కిలోనే. ఇవి కూడా అత్యధిక మందికి అందటం లేదు. పామాయిలు ఎప్పుడో రద్దు చేశారు. ఇక ప్రజాపంపిణీ వ్యవస్థ ఎత్తివేసినట్లే.
కుంటి సాకులు
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలో నగదు బదిలీ ప్రవేశపెడుతున్నామని, ఇప్పటికే కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు జరుగుతోందని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్న మాట నిజం. ఎక్కువ రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందుకు రాలేదు. నగదు విధానం ప్రవేశపెట్టిన కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పథకం విఫలమైంది.
వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం ఈ విధానం తప్పు అని చెప్పకపోగా అత్యుత్సాహంతో అమలుకు సిద్ధపడింది. కేంద్రం ఒత్తిడితో పాటు, ఆ విధానానికి వైసిపి కూడా అనుకూలం కాబట్టే అమలుకు పూనుకుంటున్నది. రేషన్ డిపోలలో ఇచ్చే బియ్యం ఎక్కువమంది తినడం లేదని, బయట అమ్ముకుంటున్నారని, ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారని దీనిని అరికట్టడం కోసమే నగదు బదిలీ అని పాలకులు ప్రచారం చేస్తున్నారు. కొందరు సజ్జలు, రాగులు తింటున్నారని, అందుకే బియ్యం ఆపేస్తున్నామని కుంటిసాకులు చెప్తున్నారు. ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టిన చందంగా ఉంది ప్రభుత్వ తీరు. జగన్ మాట ఇచ్చినట్టుగా నాణ్యమైన, సన్న బియ్యం ఇస్తే అందరూ తింటారు. బియ్యం తిననివారికి సజ్జలు, రాగులు అందించవచ్చు. గతంలో ఇచ్చారు కూడా. ఇప్పుడు మొత్తం బియ్యం సరఫరా రద్దు చేయడం ఎందుకు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దీని వెనుక రహస్య ఎజెండా ఉంది. ప్రజల మేలు కోసమే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
నగదు బదిలీతో నష్టాలు
ప్రభుత్వం ఇచ్చే కొద్ది పాటి డబ్బుతో మార్కెట్లో బియ్యం కొనుక్కోలేరు. బియ్యం రేట్లు ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చే నగదు మాత్రం పెరగదు. రేషన్ బియ్యం ఇస్తున్నందున కొంతలో కొంతైనా బియ్యం ధరలు మార్కెట్‌లో కంట్రోల్‌లో ఉంటున్నాయి. డిపోలు పూర్తిగా ఎత్తివేసిన తరువాత బహిరంగ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరుగుతాయి. అడ్డూ అదుపు ఉండదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడు రకాల కార్డులు పెట్టింది. రేషన్ తీసుకునేవారికి ఒక కార్డు. బియ్యం, రేషన్ లేకుండా ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇచ్చే కార్డు మరొకటి. విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన పథకం ఇవ్వటానికి మరో కార్డు. ఇలా మూడు రకాల కార్డులు పెట్టారు. అలాగే 300 యూనిట్ల కరెంటు దాటితే రేషన్ ఉండదు. కార్డు రద్దు చేస్తున్నారు. ఆదాయం లేకపోయినా ఇనకమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసినా కార్డు రద్దు అవుతుంది. ట్యాక్సీ కొనుక్కుని, దానిని తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్నా, నాలుగు చక్రాల వాహనం అనే పేరుతో వారి కార్డులు రద్దు చేస్తున్నారు. ఇలా రకరకాల సాకులతో ఇప్పటికే కార్డులను కుదించారు. ఆధార్ అనుసంధానం కాకపోతే రేషన్ ఇవ్వటంలేదు. వేలిముద్రలు పడకపోతే రేషన్ అందదు. ఇక ఇప్పుడు బియ్యం వద్దంటే కార్డుతో పనిలేదు. రేషన్ బియ్యం తినలేనివారికి, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మాత్రం ఎందుకు? అని చెప్పి కార్డు రద్దు చేసినా ఆశ్చర్యంలేదు. రేషన్ తోపాటు సంక్షేమ పథకాలు ఆగి పోతాయి. డిపోలలో బియ్యం, ఇతర సరుకులు నిలిపివేసిన తర్వాత పౌష్టికాహారం కోసం అంగన్‌వాడి కేంద్రాలలో తల్లులు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం మాత్రం ఉంటుందా? స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుందా? రేపు వీటినీ రద్దు చేసి నగదు ఇస్తామని చెప్పే ప్రమాదముంది. డిపోలే లేనప్పుడు డిపో డీలర్లు, రేషన్ ఇచ్చే వాహనాల పైన ఆధారపడ్డ వేలాది మంది ఉపాధి పోతుంది. రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం సేకరించి గోడౌన్లలో నిలవ ఉంచి, డిపోల ద్వారా బియ్యం అందిస్తున్నారు. డిపోల ద్వారా ప్రజలకు బియ్యం సరఫరా లేనప్పుడు రైతుల నుండి ధాన్యం సేకరణ పూర్తిగా నిలిచిపోతుంది. ప్రభుత్వం సేకరిస్తేనే రైతుకు సరైన ధర రావడం లేదు. రేపు ప్రైవేట్ మార్కెట్‌పై ఆధారపడిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర కాదు కదా, బడా కంపెనీలు ఎంత నిర్ణయిస్తే అంత రేటుకు అమ్ముకోవాల్సిందే. ధాన్యం సేకరణ లేనప్పుడు, ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్లు, దానిపై ఆధారపడిన హమాలీలు, లారీలపై ఆధారపడ్డ కార్మికులు, ఉద్యోగులతో పని లేదు. వారికి ఉపాధి ఉండదు. బియ్యం ఆపిన తర్వాత ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని గ్యారెంటీ ఉందా? ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు సకాలంలో అందడంలేదు. వంట గ్యాస్ బండ వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కున్న తరువాత 300 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. కొద్ది రోజుల నుంచి క్రమంగా సబ్సిడీ మొత్తాన్ని రద్దు చేశారు. రేపు మాత్రం బియ్యం బదులు డబ్బు ఇస్తారని నమ్మేదెలా? ఇప్పటికే రైతులు వ్యాపార పంటల వైపు మళ్లుతున్నారు. రేపు ధాన్యం సేకరణ కూడా లేకపోతే వరి వేసే నాథుడే ఉండరు. ఆహార భద్రత ఉండదు. పేదలు, రైతుల, సామాన్య ప్రజల ప్రయోజనాలు దెబ్బ తింటాయి. రేషన్ బదులు నగదు బదిలీ ఇచ్చే ఈ పథకం అన్ని విధాలా నష్టదాయకం.
కార్పొరేట్ ఎజెండా
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా సంస్కరణలను వేగంగా అమలు చేస్తోంది. పేదలు, మధ్య తరగతి ప్రజలను దెబ్బతీస్తోంది. చిల్లర వర్తకంలోకి బడా కంపెనీలు ప్రవేశించాయి. రిలయన్స్, వాల్‌మార్ట్, మెట్రో వంటి అనేక బహుళజాతి, కార్పొరేట్ సంస్థలు దుకాణాలు తెరిచాయి. ఈ నేపథ్యంలో వ్యాపారమంతా వారికి మళ్ళించాలి. డిపోలలో నిత్యవసర సరుకులు ఇస్తే వారి వ్యాపారం ఆశించినంత పెరగదు. అందుకే ప్రజా పంపిణీ వ్యవస్థను దెబ్బ తీసి మూసివేస్తే, కార్పొరేట్ వారి రిటైల్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ముందుకు సాగుతుంది. ఇదే కేంద్ర పాలకుల రహస్య ఎజెండా. వ్యవసాయ చట్టాలు తెచ్చి వ్యవసాయ రంగం, మార్కెట్‌ను, ధాన్యం సేకరణను బడా కంపెనీలకు కట్టబెట్టే మోడీ కుట్ర ఇప్పటికే అందరికీ అర్థమైంది. ప్రభుత్వం ధాన్యం సేకరణ నిలిపివేస్తే ఇక అదానీ వంటి కంపెనీలే మార్కెట్‌ను శాసిస్తాయి. ఎఫ్‌సిఐ గోడౌన్లను బడా కంపెనీలకు కారుచౌకగా లీజుల పేరుతో కట్టబెట్టవచ్చు. మోనిటైజేషన్ పైప్‌లైన్ పథకంలో ఈ అంశం ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి క్రమంగా ప్రైవేటుపరం చేసే కుట్రలు వేగంగా సాగుతున్నాయి. పేటీఎం వంటి నగదు బదిలీ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. రేపు బియ్యం బదులు డబ్బు బదిలీ చేస్తే ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేటు నగదు బదిలీ చేసే బడా కంపెనీల పంట పండినట్లే. ఈ నగదు బదిలీకి కమిషన్లు జనం కట్టుకోవలసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆహార సబ్సిడీలను కుదించింది. పేదలకు అందించే బియ్యం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలోకు 38 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాయి. భవిష్యత్తులో నగదు బదిలీ ద్వారా ఖర్చులో కోత పెట్టొచ్చు. భవిష్యత్తులో బియ్యం రేటు పెరిగినా ప్రభుత్వానికి ఖర్చు పెరగదు. బడ్జెట్లో నిధులు కోత బెట్టి ఆ డబ్బును కార్పొరేట్లకు వివిధ రూపాలలో రాయితీలు అందించవచ్చు. ఇదే మోడీ సర్కార్ కుట్ర ఎజెండా. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఖర్చు తగ్గించుకుని తమకు ప్రీతిపాత్రమైన కార్పొరేట్లకు లాభాలు సమకూర్చవచ్చు. మరోవిధంగా ప్రజల చేతిలో డబ్బు ఉంచి 'మేము మీకు డబ్బు ఇస్తున్నాం' అని భ్రమ పెట్టి ఓట్లు పొందవచ్చు. ప్రజలు ఎదురు తిరిగితే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా బెదిరించి నగదు ఆపేస్తామని బెదిరించి లొంగతీసుకోవచ్చు. ఇలా ప్రభుత్వాలు నగదు బదిలీని దశల వారీగా అమలు చేయటం వెనక కుట్ర దాగి ఉంది.
నమ్మేదే లేదు
ప్రభుత్వాలు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. పెట్రోలు, డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేస్తే రేట్లు తగ్గుతాయని ఆశపెట్టారు. వంట గ్యాస్ నగదు బదిలీతో భారం పెరగదని భ్రమపెట్టారు. సంక్షేమ పథకాలతో జీవితాలు మారిపోతాయని నమ్మబలికారు. ఆచరణలో ఏమైందో అందరూ చూశారు. ఈ నగదు బదిలీ అంతే. ప్రజలు చైతన్యంతో ఆదిలోనే ఎదుర్కోవాలి. ఈ ఉచ్చులో పడిన తర్వాత బయటకు రావడం కష్టం. ఇప్పటికే ఈ నగదు బదిలీ పథకం వివిధ ప్రాంతాల్లో విఫలమైంది. ప్రజల కష్టాలు పెరిగాయి. మన రాష్ట్రంలోనూ జనం వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ముక్త కంఠంతో నగదు బదిలీని తిరస్కరించాలి. ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్న పాలకులను నిలదీయాలి.
నగదు బదిలీ వంటి పేదల పొట్టగొట్టే ఈ పథకాల విషయంలో బూర్జువా పార్టీలన్నిటిదీ ఒకటే దారి. గతంలో కాంగ్రెస్ కేంద్రంలో ఇదే విధానం పెట్టింది. బిజెపి ఒకే దేశం, ఒకే రేషన్ అని జాతీయవాదాన్ని రెచ్చగొట్టి కొత్త రూపంలో నగదు బదిలీ విధానాన్ని అమలు చేస్తున్నది. గతంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుని వెనక్కి తగ్గింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉండి వ్యతిరేకించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఈనాడు సంక్షేమ రాజ్యం ముసుగులో అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పార్టీలు అన్నింటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు మరో మాట. మొదటి నుండి సిపిఎం, కమ్యూనిస్టులు, వామపక్షాలు మాత్రమే ఈ ప్రమాదాన్ని ఎత్తి చూపుతూ నికరంగా పోరాడుతున్నాయి. ప్రజలు ముక్త కంఠంతో నగదు బదిలీ విధానాన్ని తిరస్కరించాలి. పోరాటం సాగించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను కాపాడుకోవాలి.
/ వ్యాసకర్త : సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు /
సిహెచ్. బాబూరావు