May 27,2022 07:11

    మ్ము-కాశ్మీర్‌లో సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని గత కొన్ని వారాలుగా సాగుతున్న కిరాతక దాడుల పరంపర తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా టి.వి నటి అమ్రీన్‌ భట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. తొమ్మిదేళ్ల కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమౌతున్న సఫీవుల్లా ఖాద్రీ అనే ఒక పోలీసును కూడా ఇలానే బలితీసుకున్నారు. ఈ రెండు ఘటనల్లోనూ ఇద్దరు చిన్నారులకు కూడా తూటాల గాయాలయ్యాయి. అభంశుభం తెలియని ఆ చిన్నారులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగి అయిన రాహుల్‌ భట్‌ అనే కాశ్మీరీ పండిట్‌, శ్రీనగర్‌లో ప్రఖ్యాత కెమిస్ట్‌ మఖన్‌లాల్‌ బింద్రూ సైతం ఇలాగే ఉగ్ర తూటాలకు బలైపోయారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు అనుక్షణం కొనసాగుతున్నాయి. అటు పండిట్లు, ఇటు ముస్లింలు అనే తేడా లేకుండా సామాన్య జనం సమిధలౌతున్నారు. ఎక్కడ గ్రనేడు పేలుతుందో..ఏ క్షణాన ఏ వైపు నుంచి తూటా దూసుకొస్తోందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాశ్మీర్‌ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. జమ్ము-కాశ్మీర్‌లో 'అంతా బాగుంది' అని పాలకులు చేస్తున్న ప్రచారం పచ్చిబూటకం అని తేలిపోతోంది.
    కాశ్మీర్‌లో పరిస్థితులు మారిపోయాయని, మీరంతా తిరిగొస్తే ఉద్యోగాలు కల్పించి శాంతియుత వాతావరణంలో నివసించేందుకు చక్కని శిబిరాలను ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కాశ్మీరీయులను ఆహ్వానించింది. కొందరు కాశ్మీరీ పండిట్లు ఆ మాటలు నమ్మి తిరిగొచ్చారు. కానీ అక్కడ పరిస్థితులు గతంలో కంటే దారుణంగా ఉన్నాయని తెలుసుకోవడానికి వారికి ఎక్కువకాలం పట్టలేదు. ఉగ్ర తూటాలకు బలైపోయిన రాహుల్‌ భట్‌ ఇలా తిరిగొచ్చినవారే. ఈ దారుణ ఘటన తర్వాత కాశ్మీరీ పండిట్లు కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ద్వయానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని ఉచిత ప్రచారం కల్పించిన 'శిఖర', 'కాశ్మీర్‌ ఫైల్స్‌' అనే చిత్రాలపైనా కాశ్మీరీ పండిట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలూ కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం కోరి తీసిన చిత్రాలు కానేకావని, వాస్తవానికి అవి ప్రజల మధ్య విద్వేషాగ్ని రాజేసి హింసను మరింత ప్రేరేపించే చిత్రాలన్న విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. 2010-19 మధ్యకాలం కాశ్మీరీ పండిట్లు హత్యకు గురైన ఘటనలు చాలా అరుదు. కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత అనేక మంది హత్యకు గురౌతుండడాన్నిబట్టి అక్కడ ప్రజల భద్రత గాలిలో పెట్టిన దీపంలా వుంది.
     2019 ఆగస్టు 5న ఆర్టికల్‌ 370 రద్దు చేసి కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని కాలరాసినప్పటి నుంచి అక్కడ కేంద్ర ప్రభుత్వం తీవ్ర అణచివేతను కొనసాగిస్తోంది. జమ్ము-కాశ్మీర్‌కు ముఖ్యమంత్రులుగా పని చేసినవారూ, కేంద్ర మంత్రులుగా పని చేసినవారూ గృహ నిర్బంధాలకు, వేధింపులకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో సైతం ఇంటర్నెట్‌ నిలిపివేసి అక్కడి ప్రజానీకాన్ని ఎంతటి ఇక్కట్లకు గురిచేసిందో దేశమంతా చూసింది. ఒకవైపు జమ్ము-కాశ్మీర్‌ మొత్తాన్ని బందిఖానాగా మార్చేసి అక్కడి భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేస్తూ మరోవైపు కాశ్మీర్‌లో శాంతి సమీరాలు వీస్తున్నాయని, పర్యాటకుల తాకిడితో హిమశిఖరాలు సరికొత్త శోభతో అలరాలుతున్నాయంటూ బిజెపి ప్రభుత్వం ప్రచారం దట్టిస్తోంది. ప్రజా ప్రభుత్వం లేకపోవడం, అధికార యంత్రాంగం అస్తవ్యస్థంగా ఉండటం అక్కడి పరిస్థితులను దారుణంగా మార్చేశాయి.
     పుండుపై కారం చల్లిన చందంగా హేతుబద్ధత లేకుండా జమ్ము-కాశ్మీర్‌లో కేంద్రం ఇటీవల చేపట్టిన డీలిమిటేషన్‌ ప్రక్రియ ప్రజల్లో మరింత భయాందోళనలు రేపుతోంది. 2002లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. 2026లో జనాభా లెక్కలు పూర్తయ్యే వరకూ దేశంలో డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టరాదు. దేశంలో మిగిలిన ప్రాంతాల్లో చేపట్టినప్పుడే రాష్ట్రంలో డీలిమిటేషన్‌ చేపట్టాలని జమ్ము-కాశ్మీర్‌ అసెంబ్లీ గతంలోనే తీర్మానించింది. దీనిని హైకోర్టు, సుప్రీంకోర్టులలో కొందరు సవాలు చేయగా అసెంబ్లీ తీర్మానాన్నే న్యాయస్థానాలు సమర్థించాయి. ఈ వాస్తవాలన్నిటినీ విస్మరించి కేంద్ర ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో తన మతోన్మాద, కార్పొరేట్‌ ఎజెండాను బలవంతంగా రుద్దుతోంది. తడారని కాశ్మీర్‌ నెత్తుటి గాయానికి సంజాయిషీ ఇవ్వాల్సింది మోడీ సర్కారే.